కాకరకాయ కూరను వారంలో ఒకసారైనా తినండి..

Eat Bitter Gourd Curry At Least Once A Week

కాకరకాయ శరీరానికి ఎంతో మంచిదని పెద్దలే కాదు.. డాక్టర్లు కూడా ఎప్పుడూ చెబుతారు. బ్రకోలీతో పోలిస్తే బీటా కెరోటిన్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాకరలోని విటమిన్ ఎ శరీరానికి తగిన శక్తినిస్తుంది. కాకరలోని కాల్షియం దంతాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో పొటాషియం నరాల వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.

పొట్టకు సంబంధించిన అనేక సమస్యలకు ఇందులోని చేదు గుణం మందులా పనిచేస్తుంది. వంద గ్రా. కాకరలో 19 క్యాలరీలు.. 3.5 గ్రా.కార్బొహైడ్రేట్లు.. 2.4 గ్రా. పీచు.. 150 మి.గ్రా. కొవ్వులు.. 87 శాతం నీరు.. ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9 విటమిన్లు.. పొటాషియం, కాల్షియం, జింక్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌… వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓ కప్పు తాజా ముక్కలనుంచి రోజువారీ అవసరమయ్యే సి-విటమిన్‌లో 93 శాతం లభిస్తుంది.

డయాబెటిస్ వ్యాధికి కాకరకాయ దివ్యమైన ఔషధం. దెబ్బతిన్న బీటాసెల్స్‌ని బాగుచేయడంతోపాటు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. కాకర కాయలూ, గింజల్లో ఉండే ఎమ్ఆర్‌కె-29 అనే ప్రొటీన్‌ సైతం రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుందట. అందుకే రెండు టేబుల్‌స్పూన్ల చొప్పన తాజా కాకరకాయ రసాన్ని తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తశుద్ధికీ తోడ్పడుతుంది.

కాకరలోని మోమోర్డిసిన్‌ యాంటీవైరల్‌ గుణాన్ని కలిగి ఉంటుంది. వర్షాల్లో వచ్చే జలుబూ, దగ్గూ, జ్వరాల్ని ఇది అడ్డుకుంటుందనీ హెచ్ఐవీ, ఇతర ఇన్ఫెక్షన్లనీ నివారించ గలదనీ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాకర క్యాన్సర్‌కి కూడా మంచిదే. దీన్నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ లింఫాయిడ్‌ ల్యుకేమియా, మెలనోమా, రొమ్ము, పేగు, చర్మ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లకు సంబంధించిన ట్యూమర్లని నివారించినట్లు గుర్తించారు. పొట్ట అల్సర్లకు కారణమైన బ్యాక్టీరియానీ నిర్మూలించిందట. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం, రక్తనాళాల్లో పూడికల్ని నిరోధించడం ద్వారా హృద్రోగాల్ని రానివ్వదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకరలోని పీచువల్ల జీర్ణశక్తీ బాగుంటుంది.

నులిపురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులకి కాకర మందులా పనిచేస్తుంది. అందుకే ఈ సమస్యలున్నవాళ్లు టేబుల్‌స్పూను రసాన్ని రోజూ తీసుకుంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కాకరకాయ తినేవాళ్లకి నిద్ర సమస్యలు తగ్గుతాయట. ఇది నెలసరి నొప్పుల్నీ తగ్గిస్తుంది.
కీళ్లనొప్పులకీ కాకరకాయ ఔషధగుళికే. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు, చర్మం కూడా మెరుపుని సంతరించుకుంటాయి. కాకరలో ఎక్కువగా ఉండే ఎ-విటమిన్‌ కంటిచూపుని పెంచి, క్యాటరాక్ట్‌ రాకుండా అడ్డుకుంటుందట. ఇందులోని రసాయనాలు మలేరియానీ నివారించినట్లు కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది.

ఊబకాయం, మూత్ర వ్యాధులతో బాధపడేవాళ్లు తరచూ కాకరకాయ తింటే ఫలితం ఉంటుంది. ఆస్తమాతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల్ని ఇది తగ్గిస్తుంది.
రింగ్‌వార్మ్‌, సొరియాసిన్‌, దురదలు వంటి వ్యాధులతో బాధపడేవాళ్లకి కాకరకాయ రసం ఎంతో మేలు. ఎగ్జిమా వంటి చర్మసమస్యలతో బాధపడేవాళ్లు కాకర ఆకుల్ని నూరి ఆ ముద్దను ఆయా భాగాల్లో పెడితే అవి తగ్గుముఖం పడతాయి. ముఖంమీద మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి.