గుడ్డు ఎముకలకు బలాన్ని ఇస్తుందని, గుండెను ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రోజూ గుడ్డు తినాలని చెబుతారు.అయితే, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లకు దూరంగా ఉండటం మంచిదని డాక్డర్లు సూచిస్తున్నారు. ఒకవవేళ వారు తినాలని బలంగా అనుకుంటే పచ్చ సొనను తినకుండా..తెల్లసొనను మాత్రమే తినాలని చెబుతున్నారు. ఎందుకంటే పచ్చ సొనలో కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది.
అందుకే గుడ్లు తినేటప్పుడు ఎక్కువ గుడ్లను తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం..లేకపోతే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రోజుకు కనీసం 1 నుంచి 3 గుడ్ల వరకు తినొచ్చు. కానీ, అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.
గుడ్లలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటంతో రోజూ గుడ్డు తింటే కళ్ళకు కూడా మేలు చేస్తాయి. ప్రతిరోజూ 1-2 గుడ్లు తినడం వల్ల కంటి చూపును మెరుగు చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఎగ్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడటంతో.. శరీరంలో ఏర్పడే వివిధ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే తగినంత శక్తిని అందిస్తుంది. గుడ్లలో విటమిన్ డి ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి.
రోజు గుడ్డు తినడం మెదడుకు కూడా మంచిదే. చర్మం, జుట్టు, గోర్లు వంటి శరీర భాగాల ఆరోగ్యానికి కూడా కోడిగుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. కంటిచూపు పెంచడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి డైలీ ఎగ్ తినడం అలవాటు చేసుకోవాలి. అలా అని గుడ్లు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.