మునగ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సాంబారులో మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగను పోషకాల్ని కురిపించే కల్పవృక్షంగా భావిస్తారు. భూమి మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ, సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆఫ్రికా దేశాలలో పోషకాహార లోపంతో బాధపడే తల్లీ, పిల్లలకు మందులతో పాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు మునగ చెట్టుకు ఉన్న విలువ. మునక్కాయలే కాదు.. మునగ ఆకులోనే ఎక్కువ పోషకాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అనే కొత్త మాట ట్రెండ్ అవుతోంది.
మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ.. మునగ పొడి తినడం వల్ల తల్లిపాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్లు కథలు కథలుగా చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకూ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు.తలపైకెత్తి దానివైపే చూడలేదు. సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప.
కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్ ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. వందలు వేలు ఖర్చు పెట్టినా నయం కానీ రోగాలను మునగ ఆకు రసం నయం చేస్తుందని నిరూపించింది. ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మనదృష్టీ అటు మళ్లి..అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.
ఏముంది మునగాకులో..?
వంద గ్రాముల తాజా మునగాకులో … నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం,అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు… మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ.
మునగాకు పొడిలో ఏమున్నాయి?
టైమ్ మ్యాగజైన్ ద నెక్స్ట్ క్వినోవాగా మునగను అభివర్ణించిందంటేనే మునగ చెట్టుకున్న విలువ తెలుసుకోవచ్చు. ఇతర దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే… 100 గ్రాముల .ఎండిన ఆకుల్లో… పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్… ఇలా చాలా లభిస్తాయి. అయితే మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. తాజా మునగాకునే తిని బోలెడు పోషకాలు పెంచుకోండి.