
చాలామందికి కాలు మీద కాలు వేసి కూర్చునే అలవాటుంటుంది. ఇంకొంతమంది అయితే బాగా అలవాటు అవడం వల్ల ఆఫీసులో లేదా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు కూడా ఎక్కువ సమయం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఎక్కువ సమయం ఒక కాలిపై మరొక కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం, రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో తాజాగా ప్రచురితం అయిన అధ్యయనాలు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటులో కొంత ప్రభావం చూపిస్తుందని..ఇది తాత్కాలికంగానే ఏర్పడుతుందని తేల్చింది. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల.. నరాల వాపు వస్తుందనడంలో ఏమాత్రం నిజం లేదని అధ్యయనం తెలిపింది.
కానీ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల.. పెరోనియల్ నరాలపై ఒత్తిడి పడి కాలులో తిమ్మిరి ఏర్పడుతుంది.కానీ.. కాసేపు మాములు స్థితిలో కూర్చుంటే ఇది సెట్ అవుతుంది. అందుకే ఎక్కువ సమయం అలా కూర్చోకుండా ఉంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
కానీ చాలా సందర్భాల్లో కదలకుండా కాలు మీద కాలు వేసుకుని ఒక పక్కకు ఒత్తిడి కలిగించేలా కూర్చుంటే.. కీళ్లు లేదా మోకాలి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పటికే కాళ్లకు సంబంధించిన ఏదైన సమస్యతో బాధపడుతున్న వారు అయితే అలాగే ఒకే సీటులో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడుస్తుండూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.