
సినిమాల్లోనూ, సీరియల్స్ లోనే కాదు.. బయట కూడా మద్యం తాగిన మనిషి వింతగా ప్రవర్తించడం చూస్తుంటాం. అసలు ఏబీసీడీలు కూడా పలకలేని ఆ వ్యక్తి మందు తాగాక అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుండటాన్ని గమనిస్తూ ఉంటాం. నలుగురిలో మాట్లాడటానికే సిగ్గు పడేవాళ్లు కాస్తా మందు తాగితే పెద్ద పెద్దగా మాట్లాడుతూ, పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరి అటెన్షన్‌ను తన వైపు తిప్పుకుంటారు.
అంతెందుకు మద్యం మత్తులో ఉన్నవాళ్లు అంతవరకూ దాచిన నిజాలను బయట పెట్టేస్తారని చాలామంది అంటుంటారు. చుక్క తాగితే దిక్కులదిరిపోయేంతగా మనిషి మారడానికి మందులో అంత పవర్ ఉంటుందా అన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ఏమీ లేకపోతే మందు తాగక ముందు ఒక లెక్క.. మందు తాగాక మరో లెక్క అన్నట్లుగా మనిషిలో అంత పవర్ ఎక్కడ నుంచి వస్తుందనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెట్టడానికి కొంతమంది ఇలా తాగిన వారిపై అధ్యయనం చేయగా చాలా విషయాలు బయటపడ్డాయి.
మనిషిని మద్యం ఎంత వరకూ ప్రభావితం చేయగలుగుతుందో తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ అండ్ మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన నిపుణులు కొంతమందిపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో వారు మద్యం తాగినప్పుడు శరీరానికి మత్తు వ్యాపిస్తుందని..అందుకే వారిలో వారికే తెలియని తెగింపు, ధైర్యం, విశ్వాసం వంటివి ఎక్కువ అవుతున్నట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. దీనికి కారణం మద్యం తాగాక.. బాడీలో విడుదలయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు ఎక్కువ శాతంలో రిలీజయి మెదడును తాత్కాలికంగా ఉత్తేజ పరుస్తాయని తేల్చారు.
ఈ హార్మోన్ల వల్లే సాధారణ సమయాల్లో తమ చుట్టూ జరిగిన విషయాలను, సమాజం నుంచి గ్రహించిన, బయటకు చెప్పుకోలేని విషయాలను మనసులో దాచుకొన్న ఎన్నో విషయాలను మద్యం తాగినప్పుడు వాటిని బయటకు చెప్పేస్తుంటారు. మద్యం మత్తు మెదడులోని కణాలను ప్రభావితం చేయడం వల్ల జరిగే రసాయనిక చర్యల వల్ల లభించే ప్రేరణ, ఏర్పడే విశ్వాసం దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా మద్యం మత్తు.. మెదడు యాక్టివిటీస్‌లో క్రియాశీలతను కూడా తగ్గిస్తుంది.
తాగిన మోతాదును బట్టి వారిలో విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం తాగిన కొంతమంది వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తుంటారని అధ్యయన కర్తలు తేల్చారు. అంతేకాకుండా తమకు నచ్చిన పనులను ఆ సమయంలో భయం లేకుండా చేసి .. మద్యం మత్తులో ఉండటం వల్లే అలా చేశామని చెప్పడానికి కొంతమంది మందును సాకుగా ఎంచుకుంటారని అధ్యయన కర్తలు తెలిపారు. అయితే ఇది చాలా తక్కువ మందిలోనే గమనించినట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY