బెల్లం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే బెల్లాన్నిడైరక్ట్ గా తిన్నా.. బెల్లంతో తయారైన ఆహార పదార్ధాలు తీసుకున్నా.. శరీరానికి ఐరన్ తో పాటు చాలా పోషకాలు లభిస్తాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కల్తీ బెల్లం రాజ్యమేలడంతో అది తింటే ఆరోగ్యం కాదు.. రోగాలు కొనితెచ్చుకోవడమే అంటున్నారు వైద్యులు. బెల్లాన్ని చెరుకుతో తయారు చేయకుండా.. నాసిరకం పంచదారలో కెమికల్స్, రంగులు కలిపేసి తయారుచేస్తున్నారు. బంగారంలా మెరుస్తుంది కదా అని దాన్ని కొని వాడితే.. మనకు తెలీకుండానే అనేక కెమికల్స్ ను బాడీలోకి పంపిస్తున్నట్లే అవుతుంది.
చెరుకును సాగు చేసి దాని నుంచి జ్యూస్ తీసి, కాచి తయారు చేసే ఒరిజినల్ బెల్లం అసలు మార్కెట్‌లో దొరకటం లేదు. ఇప్పుడు అంతా పంచదారతో తయారైన బెల్లాన్ని ఎక్కువగా అమ్మేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీలో.. నాసిరకం అంటే థర్డ్ గ్రేడ్ పంచదార పాకంలో రంగులు, రసాయనాలు వేసి ఈ కృత్రిమ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పసుపు రంగులో ఉంటే ఒకరేటు , కాఫీ రంగులో ఉంటే ఆర్గానిక్ బెల్లం అంటూ రకరకాలుగా అమ్ముకుంటూ.. సొమ్ము చేసుకుంటున్నారు .
మరికొద్ది మంది అసలు బెల్లాన్ని కొద్దిగా తీసుకుని.. దానికి ఎక్కువ పాళ్లలో కాల్షియం కార్బొనేట్, సోడియం బైకార్బొనేట్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. కల్తీ బెల్లం బరువు ఎక్కువయ్యేందుకు కాల్షియం కార్బొనేట్ ను, దానికి రంగునిచ్చేందుకు సోడియం బైకార్బొనేట్ ను కలుపుతున్నారు. పండుగ సీజన్లు, పెళ్లిళ్లు రావటంతో టన్నులకొద్దీ ఈ నకిలీ బెల్లం మార్కెట్ లోకి చేరిపోతుంది .
అసలు బెల్లం శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. కానీ ఈ కల్తీబెల్లం హాని కలిగిస్తుంది. బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, జింక్, విటమిన్ బీ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అవి మన ఒంట్లోని మలినాలను తీసేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారైన బెల్లం నిత్యం శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ తో పాటు జీర్ణవ్యవస్ధ దెబ్బతింటుంది.
బెల్లాన్ని రంగుచూసి కొనేకంటే.. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించాలి. నమ్మకమైన వ్యక్తుల వద్ద దీన్ని కొనుగోలు చేయటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒరిజినల్ బెల్లం ముక్కను నీళ్లలో వేస్తే కరిగిపోతుంది. అయితే నీటి కింద వ్యర్థం ఎక్కువగా మిగిలితే అది కచ్చితంగా నకిలీదేనని గుర్తించాలి.