మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పండ్లను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మహిళలు సరైన పోషకాహారం తీసుకోకపోతే..దాని వల్ల హార్మోన్ల అసమతుల్యత, బలహీనత, ఎముకల సమస్యలు, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని రకాల పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని పెద్దలు తరచూ చెబుతారు. యాపిల్‌లో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉండటం వల్ల కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్ లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ వల్ల ఆకలి వేయకుండా నియంత్రించబడుతుంది కాబట్టి దీనివల్ల అధిక బరువును అదుపులో ఉంచొచ్చు.
టమాటాలు అంటే కూరగాయలుగా మాత్రమే కాకుండా పండ్లగానూ వాడొచ్చు. మహిళల ఆరోగ్యానికి టమాటా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా లైకోపీన్ ఉండటం వల్ల ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. తరచుగా టమాటాలను తినే మహిళల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనల్లో కూడా తేలింది.
జామ పండులో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంచడంలో జామ పండు ది బెస్ట్ అంటారు. పొటాషియం, పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే నెలసరి సమస్యల నివారణకు సహాయపడే గుణాలు కూడా జామ పండులో ఉంటాయి.
బొప్పాయిలో విటమిన్ A, C, ఫోలేట్, ఇతర ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, అజీర్ణం, మలబద్ధకం సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో బీటా కెరోటీన్ ఉండటంతో ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.
చెర్రీ పండ్లను వారానికి ఒకసారయినా తింటే ఎముకల బలహీనత తగ్గి జాయింట్ల నొప్పులు తగ్గుతాయి. షుగర్ లేకుండా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు శరీరానికి అందుతాయి.
అవకాడో మోనోఅన్‌శాట్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మధ్యాహ్న భోజనం ముందు అవకాడో తినడం వల్ల ఆకలి నియంత్రణగా ఉండి ఎక్కువ తినకుండా కాపాడుతుంది. అలాగే ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.