కార్పొరేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారికే కాదు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న అదిరికి పని ఒత్తిడి ఓ పెద్ద సమస్యగా మారింది. పని ఒత్తిడి కారణంగా పూణెలో ఓ మహిళ చనిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత లక్నోలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పని ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రెషర్ అనేది ఇబ్బందిగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పని ఒత్తిడిని నియంత్రించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ఒత్తిడి కారణాలు గుర్తించాలి
ఒత్తిడికి కారణం ఏమిటో గుర్తించాలి. ఆర్థిక సమస్య కారణమైతే దానికి పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. భాగస్వామితో కలిసి కూర్చుని సరైన ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం, ఖర్చులు తగ్గించుకోవడం; ఆఫీసులో పని ఎక్కువగా ఉంటే- ఇతరుల సాయం తీసుకోవడం, పనిని అంచెలంచెలుగా ప్లాన్ చేసుకుని సమయం ప్రకారం పూర్తి చేయడాన్ని అలవాటు చేసుకోవడం.. ఇలా సమస్యని బట్టి పరిష్కారాలు ఆలోచించాలి.
కొంతమంది చిన్న చిన్న విషయాలకూ, తమ పరిధిలో లేని అంశాలకూ కూడా అతిగా స్పందిస్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎంత కోపం తెచ్చుకున్నా మనం చేయగలిగిందేమీ ఉండదు. కానీ ఆ కోపం తాలూకు ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అలాంటి ప్రభావం తరచూ ఏదో ఒక కారణంగా శరీరంమీద పడుతూ ఉంటే అది తట్టుకోలేని స్థాయికి చేరుతుంది. అందుకే ఒత్తిడి వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతున్నట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతిసారీ కౌన్సెలింగ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు, సన్నిహితులతో చర్చించినా ఫలితం ఉంటుందంటున్నారు మానసిక నిపుణులు. దానివల్ల సమస్యను మరో కోణంలో చూడడం సాధ్యమవుతుంది. పంచుకోవడానికి ఎవరూ లేరనుకున్నప్పుడు, ఆ సమస్య మరొకరికి చెప్పుకునేది కాదనుకున్నప్పుడు కనీసం డైరీలో రాసి పెట్టుకున్నా చాలు- మనసుకి రిలీఫ్‌గా ఉంటుంది. ఒకటికి రెండుసార్లు అది చదువుకుంటే ఆలోచనలోనూ స్పష్టత వస్తుంది. దాంతో పాటే రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా సాధన చేయాలంటున్నారు నిపుణులు.
విరామం
పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే పని మధ్య విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పని మధ్య విరామం తీసుకొని మళ్లీ ప్రారంభించినట్లయితే అది మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. అంతేకాకుండా బ్రేక్ టైమ్‌లో పని గురించే ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులతో ఫోన్ మాట్లాడితే కాస్త రిలీఫ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సమస్యపై చర్చించుకొండి
మీరు పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతుంటే సహోద్యోగులతో మాట్లాడటం ద్వారా మీ మనస్సును తేలికపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉత్తమం. మీరు ఇంటి నుండి పని చేస్తుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడండి.
సహోద్యోగుల నుండి సహాయం
పనిభారాన్ని నిర్వహించడానికి ఒక మార్గం మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోవడం. సహాయం కోసం అడగడానికి మీరు వెనుకాడాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేయటం వలన ఒత్తిడి లేకుండా ప్రయోజనం పొందుతారు. మీరు పని ఒత్తిడి గురించి మీ బాస్‌తో కూడా మాట్లాడవచ్చు.
పుష్కలంగా నిద్ర, యోగా
పని ఒత్తిడి వల్ల వచ్చే ప్రెషర్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనిని నివారించడానికి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు తగినంత నిద్ర, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు.