మృదువైన, పగుళ్లు లేని కోమలమైన పాదాల కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చిన్నచిన్న చిట్కాలతోనే పగుళ్లు లేని పాదాలను మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని వెన్నపూస లేదా వేజిలైన్ లేదా కొబ్బరినూనెను రాసుకుని బాగా మసాజ్ చేసి..వీలయితే సాక్సలు వేసుకుని పడుకుంటే కొద్దిరోజుల్లోనే పగుళ్లు మానిపోతాయి.
తుమ్మ జిగురును నీటితో ముద్దగా నూరి కాలి పగుళ్ల పైన పట్టించాలి. ఇలా రోజూ చేసినా కూడా పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా తయారవుతాయి. కొబ్బరి పాలలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి పగుళ్లకు రాస్తూ ఉన్నా కూడా కొద్ది రోజుల్లోనే కోమలమైన పాదాలు సొంతం అవుతాయి.
బెల్లం, మైనం, గుగ్గిలం, నెయ్యి వీటిని సమభాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ ను డైలీ కాలి పగుళ్లకు పట్టిస్తే తొందరగా తగ్గిపోతాయి. ఉల్లి చెక్కను కానీ, అరటి తొక్కలను కానీ పగుళ్ల మీద రుద్దుతూ ఉన్నా కూడా… పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా మారతాయి.
కొద్దిగా తేనె తీసుకుని వేడిచేసి ఇందులో కాస్త బటర్ ను కలిపి సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కాళ్ల పగుళ్లకు రాస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే కాళ్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. కొంచెం గుగ్గిలం తీసుకుని అందులో కొద్దిగా ఆవనూనె కలిపితే వెన్నలాగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని కాళ్ల పగుళ్లకు రాస్తూ ఉంటే వారం రోజులలో కాళ్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.