ఈ మధ్యకాలంలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్‌పై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అతిగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారిలో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మసిస్టులకు ఆదేశాలిచ్చింది. అయితే.. తినే మాంసంలోనూ యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉంటున్నాయని, ఈ పరిణామం మానవుల్లో రుగ్మతలకు కారణమవుతాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. 190 దేశాల్లో ఈ పరిశోధన చేయగా.. మాంసంలో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్న జాబితాలో భారత్ 30వ స్థానంలో ఉంది. అంటే.. సగటున ప్రతి కిలో మాంసంలో 114 మిల్లీగ్రాముల మేర యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్నాయి.
భారత్‌లో ప్రతి కిలో మటన్‌లో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు 243 మిల్లీ గ్రాముల మేర ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇక చికెన్‌లోనూ 35 మిల్లీగ్రాములు యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్నట్లు తేలింది. ఇలా యాంటీబయాటిక్స్ ఆనవాళ్లున్న మాంసాన్ని తిన్న మానవుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలుంటాయని పరిశోధకులు హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్‌లోని పశు, మత్స విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్‌స్టాక్ ఉత్పత్తుల విభాగం కూడా మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు పేరుతో ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. పశువులకు ఇచ్చే యాంటీబయాటిక్స్.. వాటిని తినే మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయని వీరు గుర్తించారు. పశువులకు యాంటీబయాటిక్స్ ఇచ్చిన 14 రోజుల వరకు వాటి మాంసాన్ని వినియోగించకూడదని సూచించారు.
మనదేశంలో పశువులకు అధికంగా యాంటీబయాటిక్స్ ఇస్తుంటారని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో మాంసంలోని యాంటీబయాటిక్స్ అవశేషాలు మానవుల్లో చేరితే.. దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు . పశు, మత్స విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయంలోని లైవ్‌స్టాక్ ఉత్పత్తుల విభాగం పరిశోధనలో కూడా.. మాంసంలోని యాంటీబయాటిక్స్ వల్ల మానవుల్లో జీర్ణక్రియ సమస్యలు, కొన్నిరకాల క్యాన్సర్లు, నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని తేలింది. మాంసంలో ఉండే బీటా లాక్టమ్స్ కారణంగా చర్మవ్యాధులు , టెట్రాసైక్లిన్ అవశేషాల కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిర్ధారణ అయ్యింది. పశువులు, కోళ్లలో వాడే పలు రకాల యాంటీబయాటిక్స్ వల్ల పలురకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు.