పరగడపున చేయకూడని పనులు

What Happens If You Do These Mistakes On An Empty Stomach

ఉదయం లేవడంతోనే ఉరుకులు, పరుగులతోనే జీవితం ప్రారంభం అవుతుంది. ఏం తింటామో.. ఏం తాగుతున్నామో.. ఏం చేస్తున్నామో తెలియకుండానే ఆ రోజు ముగిసిపోతుంది. ఆ హడావుడిలోనో.. ఒత్తిడిలోనో .. కొత్త ఉత్సాహం రావడానికో టీ,కాఫీలు కడుపులో వేసేస్తాం. అయితే అలా పొద్దున ఖాళీ కడుపుతో చేసే తప్పులతో ఎన్నో ఇబ్బందులున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఖాళీ కడుపుతో చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టీ , కాఫీలు తాగడం…
ఖాళీ కడుపుతో చాలా మందికి బెడ్ కాఫీ, బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ, టీలు తాగడం మంచిది కాదు. ఇలా తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. దీనితో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపున కాఫీ, టీ తాగకుండా ఉండడం మేలని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్..
కొంతమంది పొద్దుపొద్దునే చుక్క పడితే కాని బాడీ ఎనర్జిటిక్ గా ఉండదనుకుంటారు. దీంతో ఉదయాన్నే కాస్తయినా ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో కానీ.. ఫుడ్ తిన్న చాలా సేపు తర్వాత కానీ ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేయడం వలన పల్స్ రేటు కూడా టెంపరరీగా తగ్గిపోతుంది. అలానే కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, లివర్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సాఫ్ట్ డ్రింక్స్ తాగడం..
సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఖాళీ కడుపుతోనే కాదు.. అసలు తాగకపోవడమే మంచిదని, ఇందులో కార్బన్ డయాక్సైడ్ , చక్కెర స్థాయి కూడా అధికంగానే ఉంటుంది. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
చూయింగ్ గమ్ తినడం..
చాలా సిల్లీగా అనిపించినా ..ఎంప్టీ స్టమక్ తో చూయింగ్ గమ్ కూడా తినకూడదు. ఖాళీ కడుపున చూయింగ్ గమ్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టం డైజెస్టివ్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో కడుపు మీద ఉండే లైనింగ్ తొలగి పోతుంది. దీనిద్వారా అల్సర్ల సమస్యలు వస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోకూడని పదార్థాలు..
టిఫిన్ లో ఎక్కువ కారం లేకుండా చూసుకోవాలి. కారం ఉన్న పదార్థాలు తిన్నప్పుడల్లా.. కడుపులో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటంతో.. చాలాసేపు కడుపులో ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఉదయం పూట అల్పాహారం తీసుకునేటప్పుడు కారం పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అలాగే కూరగాయలను ఉడికించి, లేదా అలాగే తినడం మంచిదే కాని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయంటున్నారు.