చలికాలంలో తెల్లవారుజాము సమయంలోనే చాలామందికి ఎక్కువగా గుండెపోటుకు గురవుతుంటారు. ఎండాకాలం, వానాకాలంతో పోల్చితే చలికాలంలోనే ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తుంటాయి. అందుకే చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లు కూడా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. దీంతో చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఉంటుందా అన్న అనుమానాలు చాలామందికి తలెత్తుతాయి.
నిజమే చలికాలానికి , గుండెకు సంబంధం ఉంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్తప్రవాహం తగ్గి గుండెపైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో రక్తపీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు.దీనికి అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు వంటివి కారణమవుతాయని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి చలిలో శారీరక శ్రమ ఒకింత గుండెకు హానికరమేనని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా చలిలో ఎలాంటి రక్షణ లేకుండా ఆకస్మికంగా వ్యాయామాలు చేయటం వల్ల గుండె పనితీరు క్షీణిస్తుందట. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారెవరయినా సరే చలికాలంలో మాత్రం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలనే ఎంచుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్డిసోల్ లెవల్స్ అంటే ఒత్తిడి హార్మోన్స్ పెరుగుతాయి. రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూటే ఎక్కువగా ఉండటంతో…ఒకేసారి వేగంగా పరిగెత్తడం, నడవడం వంటివి చేయకూడదు.
చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాల్సి వస్తే మాత్రం నెమ్మదిగా ప్రారంభించి కాస్త అలవాటు పడ్డాక మోతాదు పెంచాలి. అది కూడా వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంటి పరిసరాల్లోనే నడక, సాధారణ వ్యాయామాలు చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ధ్యానం, ప్రాణాయామం వంటి వాటితో ఎక్కువ ప్రయోజనం ఉంటుంటుందంటున్నారు.
షుగర్, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులున్నవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలు కాపాడే దుస్తులు ధరించాలి. తల, చెవులు, చేతులు, కాళ్లు వంటి భాగాలను చలి గాలి తగలకుండా రక్షించుకోవాలి. ధూమపానం, మద్యం అలవాటు ఉన్నవారు వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ నియంత్రించుకోవాలి. ఈ కాలంలో కూరగాయలు, పండ్లు, గింజలు, ప్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వేడి సూప్స్, గోరు వెచ్చని నీరు తాగటం మంచిది. డీహైడ్రేషన్ వల్ల కూడా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చలి వాతావరణానికి రక్తనాళాలు మూసుకుపోయి.. రక్తం గడ్డకడుతుంది. కాబట్టి చలికాలంలో దాహం అనిపించకపోయినా నీరు తీసుకుంటూ ఉండాలి.