ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.అజీర్తి సమస్యలు, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. అజీర్తి సమస్య వినడానికి చిన్నదిగానే ఉన్నా.. అనుభవించిన వారికి మాత్రం బాధాకరమే. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు ఈ తప్పులు లేకుండా చూసుకోవాలి. దీంతో కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కడగని పండ్లు, కూరగాయలు..
కూరగాయలు, పండ్లు పండించే టప్పుడు, నిల్వ ఉంచడానికి, ఫ్రెష్ గా ఉంచడానికి కెమికల్స్ వంటివాటిని ఉపయోగిస్తారు. అందుకని కూరగాయలు, పండ్లు తినేటప్పుడు ముందు శుభ్రంగా కడుక్కోండి. పండ్లను గోరువెచ్చని నీళ్లు, ఉప్పు వేసి కడిగాక తినడం అలవాటు చేసుకోవాలి. లేదంటే అలాగే తినడం వల్ల కెమికల్స్ పొట్టలోకి వెళ్లి ఇతర సమస్యలు ఏర్పడతాయి.
సరిగ్గా ఉడకని మాంసం
తక్కువ సమయంలో ఉడికించిన మాంసం తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీట్ లో హానికరమైన బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. మాంసం పూర్తిగా ఉడకకపోతే క్రిములు బ్యాక్టీరియా వంటివి చనిపోవు. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కడుపునెప్పి,డయేరియాతో బాధపడవలసి వస్తుంది.
పచ్చి పాలు తాగడం
పచ్చి పాలు తాగడం వల్ల కూడా అజీర్తి సమస్యలు వస్తాయని గమనించాలి. పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా వల్ల అనారోగ్యం కలుగుతుంది. కనుక పచ్చి పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డైట్లో తీసుకోవద్దు.
టీ ,కాఫీ
కడుపు నొప్పి మొదలైన సమస్యలు ఉంటే టీ, కాఫీని తగ్గించడం మంచిది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, అజీర్తి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.
ఉప్పు , పంచదార
వీలైనంతవరకూ పంచదార, ఉప్పు డైట్లో తగ్గించడం మంచిది. ఇప్పుడు కాస్త అవేర్ నెస్ వచ్చి షుగర్ వాడకం తగ్గించినా… సాల్ట్ ను మాత్రం ఎక్కువగానే వాడుతున్నారు. దీని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే విధంగా కారాన్ని కూడా తగ్గించడం మంచిది. ఎండుకారానికి బదులు పచ్చిమిర్చిని వంటకాల్లో చేర్చుకోవచ్చు. అవగాహన లేకుండా తినే తిండి వల్ల అజీర్తి సమస్యలతో ఇబ్బందులు పడాల్సివస్తుంది. అందుకే కాస్త జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారనియమాలు పాటిస్తే.. హెల్దీగా ఉండొచ్చు.