కొంతమంది వంటింట్లో చేసే చిన్న చిన్న పనులకు కూడా హైరానా పడిపోతారు. మరికొంతమంది అయితే చాలా ఈజీగా పనులు చేసుకోవడమే కాకుండా పక్కవాళ్లకు కూడా హెల్ప్ చేస్తుంటారు. అయితే కొద్ది పాటి చిట్కాలు తెలిస్తే చాలు.. పనులు త్వరగా అయిపోవడమే కాకుండా తినే ఫుడ్ టేస్ట్ కూడా పెరిగిపోతుంది.
పప్పు కానీ, రసం కానీ చేసుకుంటే.. సైడ్ డిష్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంత మందికి ఆమ్లెట్ చాలా ఇష్టం. అయితే, ఈ ఆమ్లెట్ వేసినపుడు గుల్లగా పొంగినట్లు రావాలంటే కొడిగుడ్డుని గిలక్కొట్టే ముందు అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా పాలు వేయాలి. అప్పుడు ఆమ్లెట్ పొంగినట్లుగా వస్తుంది.
బిర్యానీ చేసేటపుడు బియ్యం కడిగిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది.
పప్పు త్వరగా ఉడకాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి. లేదా ఒక స్పూన్ ఆయిల్ వేసినా సరిపోతుంది.
వంటగదిలో ఈగలు వంటివి రాకుండా ఉండటానికి రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లు వేసి, టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి కిచెన్ ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తే ఈగలు రావు. దీంతో పాటు కింద ఏదైనా నూనె, ఇతర పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు తొలగిపోతాయి.
బంగాళదుంప, బెండకాయ వంటి ఫ్రై చేసుకునేటపుడు కళాయి అడుగు భాగానికి అంటుకుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. కళాయి వేడి అయిన తర్వాతే నూనె వేయాలి.
ఇక పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే.. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరి. పచ్చి బఠాణి ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే.. వాటిని ఓ క్లాత్ లో మూటకట్టి ముందుగా వేడినీళ్లలో 3 నిమిషాలపాటు.. మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీళ్లలో ముంచాలి. తర్వాత ఎండలో ఆరబెట్టి,వాటిని గాలి వెళ్లని డబ్బాలో వేసి.. ఫ్రిడ్జిలో పెట్టాలి. లడ్డూలను ఓ అర నిమిషం మైక్రోవేవ్‌లో ఉంచి తీస్తే తాజాగా ఉంటాయి.