యాపిల్ ఐఫోన్ 16ఈ: మధ్య తరగతి వినియోగదారుల కోసం కొత్త మోడల్

Apple Launches Iphone 16E A Budget Friendly Option For Indian Consumers

యాపిల్ భారతదేశంలోని మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్‌గా చేసుకొని ఐఫోన్ 16ఈ మోడల్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఫోన్-ఎస్ఈ వెర్షన్‌ సేల్స్‌ను మౌనంగా పక్కన పెట్టిన యాపిల్, ఐఫోన్ 16 సిరీస్‌లో మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఐఫోన్ 16ఈ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 49,500గా ఉంటుందని ప్రకటించినప్పటికీ, భారతదేశ మార్కెట్‌లో దీని ధర రూ. 59,900గా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఐఫోన్ 16ఈ కోసం ప్రీ-ఆర్డర్‌లు ఫిబ్రవరి 21న ప్రారంభమవుతాయి. అలాగే డెలివరీలు ఫిబ్రవరి 28 నుంచి మొదలవుతాయి.

డిస్‌ప్లే & హార్డ్‌వేర్

ఐఫోన్ 16ఈ 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది వినియోగదారులకు అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో యాక్షన్ బటన్ కూడా ఉంది, దీని ద్వారా వినియోగదారులు కెమెరాను వేగంగా ప్రారంభించగలరు.

అలాగే, ఐఫోన్ 16ఈ యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది ఛార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్‌లో మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఐఫోన్ 16ఈ యాపిల్ ఏ18 చిప్ ద్వారా పని చేస్తుంది. ఈ చిప్ సెట్ 6-కోర్ సీపీయూతో పనిచేస్తుంది. ఐఫోన్ 11లో ఉపయోగించిన ఏ13 బయోనిక్ చిప్ కంటే 80% వేగంగా పని చేయగలదు.

ఈ ఫోన్‌లో 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను అమర్చారు, ఇది మెషిన్ లెర్నింగ్ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదు. ఐఫోన్ 16ఈ యాపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

కెమెరా & ఫోటోగ్రఫీ ఫీచర్లు

ఐఫోన్ 16ఈ సింగిల్ 48 ఎంపీ ఫ్యూజన్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. కెమెరా సిస్టమ్ 2ఎక్స్ టెలిఫోటో జూమ్‌కు మద్దతు అందిస్తుంది. డిఫాల్ట్‌గా ఈ ఫోన్ 24 ఎంపీ ఫోటోలను తీసుకుంటుంది, అయితే అధిక-రిజల్యూషన్ షాట్‌ల కోసం 48 ఎంపీ మోడ్‌కి మార్చుకోవచ్చు.

కెమెరా పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, HDR ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది, తద్వారా వివిధ లైటింగ్ పరిస్థితుల్లో మెరుగైన ఫోటోలు అందుబాటులో ఉంటాయి. సెల్ఫీ కోసం 12 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరా అందించబడింది. దీనిలో ఆటోఫోకస్, 4K వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.

బ్యాటరీ లైఫ్ & కనెక్టివిటీ

ఈ ఫోన్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ చెబుతోంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. మెసేజింగ్ వయా శాటిలైట్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ వంటి ఉపగ్రహ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఐఫోన్ 16ఈలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. అయితే ఈ అత్యవసర ఫీచర్ యూఎస్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందా లేదా భారత వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ లభిస్తుందా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.