ఎవరైనా సరే తాము ఆర్థికంగా, శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే కోరుకుంటారు. అయితే కొంతమంది ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటివారు హిందూ సంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. ఇంట్లో ఎలాంటి శారీరక, ఆర్థిక సమస్యలు రాకుండా కుటుంబం అంతా హాయిగా, సంతోషంగా ఉండటానికి తప్పకుండా వాస్తు నియమాలను పాటిస్తుంటారు.
కొంతమంది ఇంటిని కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించుకుంటారు. వాస్తు శాస్త్రం కరెక్ట్‌గా ఉంటే ఇంట్లో అన్నీ శుభపలితాలే ఉంటాయని..ఇంట్లో డబ్బు ప్రవాహంలా ఉంటుందని అంతా నమ్ముతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల జీవరాశులను ఇంటికి తీసుకొస్తే అంతా శుభం జరుగుతుందని.. ఇంట్లో డబ్బు ఫుల్‌గా ఉంటుందని వాస్తు పండితులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి కొన్ని వస్తువులు తీసుకొచ్చినా కూడా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుందేలును పెంచుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు. కుందేలును అదృష్టంగా భావిస్తారు కాబట్టి.. కుందేలు ఇంటికి రావడం వల్ల శుభాలకి సంకేతంగా చెబుతారు వాస్తు పండితులు. చాలా మంది ఇంట్లో తెల్ల కుందేలును పెంచుకుంటారు. దీనివల్ల ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణమే ఉంటుందట.అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ అనుకూలంగా ఉండటంతో పాటు.. ఆర్థిక సమస్యలన్ని కూడా క్లియర్ అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇంట్లో చేపలు పెంచుకోవడాన్ని చాలా మంది శుభ సూచికంగా భావిస్తారు. ఇంట్లో ఆక్వేరియంలో ఇంట్లో చేపలను పెంచుకుంటే వాటి వల్ల సుఖసంతోషాలు ఉంటాయని అంటుంటారు. ఎలాంటి గొడవలు లేకుండా ఆనందం, శాంతి అన్నీ ఉంటాయని నమ్ముతారు. సంపదకు చిహ్నంగా చేపలను చూస్తారు. ఇవి ఇంట్లో ఉంటే డబ్బులో లోటు ఉండదని చాలా మంది నమ్ముతారు. ఈ కారణాల వల్లే చాలా మంది వారి ఇంట్లో చిన్నదో, పెద్దదో ఏదైనా సరే ఇంట్లో ఆక్వేరియాన్ని పెట్టుకుంటారు.
ఇంట్లో తాబేలును పెంచుకుంటే శుభప్రదమని వాస్తు పండితులు చెబుతారు. ముఖ్యంగా ఇంటి ద్వారం దగ్గర తాబేలు తిరుగుతూ ఉంటే ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని అంటారు. తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి..ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. అలాగే ఇంటికి అకస్మాత్తుగా తాబేలు వస్తే ఆ ఇంటికి ఊహించని ఆర్థిక లాభం వస్తుందని వాస్తు పండితులు అంటారు. తాబేలుకు బదులు తాబేలు బొమ్మను పెట్టుకున్నా మంచిదని అంటారు.