మహాశివుడికి కార్తీక మాసం అంటే ఎంత ప్రియమైన మాసమో..శ్రావణ మాసం కూడా అంతే ప్రియమైనది. అందులోనూ శ్రావణ మాసంలో శివయ్యకు సోమవారం మరింత ప్రీతికరం.ఈరోజు శ్రావణ తొలి సోమవారం కాబట్టి..నేడు జలరూపంలో ఉన్న శివుడికి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ పూజలో ఓం భవాయ జల మూర్తయే నమ:అనే మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు.
అలాగే నేడు పరమేశ్వరుడికి పూజ చేస్తే..కొన్ని రకాల పువ్వులను పూజలో ఉపయోగించినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా మందారపువ్వు, జిల్లేడుపువ్వు, గన్నేరుపూలతో పూజ శివయ్యకు చాలా ఇష్టమట. గన్నేరు పూలతో పూజ చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం దొరుకుతుందట.
లింగ పురాణంలో పరమ శివుడికి అరటిపండ్లు, నిమ్మకాయలు, దానిమ్మపండ్లు, నేరేడుపండ్లు, జామకాయలతో అభిషేకం చేస్తే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడని ఉంది.దీనికితోడు ఈరోజు శివనక్త వ్రతం ప్రారంభం కాబట్టి..ఈ వ్రతాన్ని పాటించేవారు..పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి..ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తినాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల శివుడి అనుగ్రహం పొందుతారని అంటున్నారు.
శ్రావణ మాసంలో ప్రతిరోజూ శివతాండవ స్తోత్ర పారాయణమనేది అందరికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. శివయ్య భక్తుల కోరికలన్నింటినీ తీర్చగలడు. శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో విశేష ప్రయోజనాలు లభిస్తాయని…విశేష విజయాలు సాధిస్తారని నమ్ముతారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కెరీర్లో విజయం సాధిస్తారు. అంతేకాదు శివతాండవ స్తోత్రం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.
అంతేకాకుండా శ్రావణ మాసంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా మంచి జరుగుతుందని శివపురాణంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అకాల మరణం నుండి విముక్తి పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగడంతో పాటు అన్ని ప్రాపంచిక బాధల నుంచి విముక్తి పొందుతారు. శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే వారి సమస్యలు తొలగిపోవడంతో పాటు కష్టాల నుంచి కూడా బయటపడతారు.