2024 పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు అరుదైన గౌరవం దక్కింది. వినేష్ పుట్టినరోజును పురస్కరించుకుని హర్యానాలోని సర్వ్ ఖాప్ పంచాయత్ ..ఆమెకుగోల్డ్ మెడల్‌ను ప్రదానం చేసి అక్కున చేర్చుకుంది.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో.. వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లినా ఊహించని షాక్ ఇచ్చి వేటు పడింది. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను వినేష్ ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఊహించని కారణంతో ఆమె డిస్ క్వాలిఫై అయింది. 100 గ్రాముల అధిక బరువు వల్ల ఫొగట్ అనర్హత వేటుకు గురవడంతో ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయింది.
నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం వినేష్‌కు ఖాయం అయ్యేదే. శరీర అధిక బరువు కారణంగా చెప్పి ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొని..ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.
తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమె తరఫున అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. అయితే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలు అన్నీ పరిశీలించిన కోర్టు..ఆమెపై అనర్హత నిర్ణయాన్ని సమర్థించడంతో.. కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు తిరిగి వచ్చిన వినేష్ ఫొగట్‌కు.. హర్యానా ఖాప్ పంచాయత్ బంగారు పతకంతో గౌరవించి ఆమెను తమ గుండెల్లో పెట్టుకుంది. 31వ పుట్టినరోజు నాడు వినేష్‌కు ఈ మెడల్‌ను అందజేసింది. ఖాప్ పంచాయత్ తన సొంత నిధులతో తయారు చేయించిన ఈ పతకంపై.. ఒలింపిక్స్ సింబల్, 2024 అనే అక్షరాలను ముద్రించింది.
దీనిపై వినేష్ ఫొగట్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన సొంత ఊరిలో, సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తోందని వినేష్ చెప్పింది. అంతకుమించి హర్యానా ఖాప్ పంచాయత్ తనకు బంగారు పతకాన్ని బహూకరించడం చిరస్మరణీయంగా మిగిలిపోతుందంటూ వినేష్ భావోద్వేగానికి గురయ్యింది.