టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అతను రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా ఎర్ర బంతితో బౌలింగ్ ప్రాక్టిస్ చేస్తున్నాడు. గంటలకొద్దీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన స్టామినాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. వచ్చే 5 నెలల్లో టీమిండియా 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో 2-మ్యాచ్‌ల సిరీస్ ఆడిన తర్వాత, వారు న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పోటీపడనుంది. దీని తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లి కంగారూలతో 5 మ్యాచ్‌ల టెస్ట్ క్రికెట్ సిరీస్ ఆడనుంది.
పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటే టీమ్‌కాంబినేషన్ సమతూకంగా ఉండటంతో పాటు అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకునే వెసులుబాటు మేనేజ్‌మెంట్‌కు కలుగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి హార్దిక్ పాండ్యాను సిద్దం చేయాలనే పట్టుదలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా వీడియోను పోస్టు ద్వారా హార్దిక్ మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలని చూస్తున్నట్లు స్పష్టమైంది. 2018 సెప్టెంబర్‌లో చివరిసారిగా హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల బెడదతో రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. ఓ దశలో అతను సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా ప్రచారం జరిగింది. కాగా టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు ప్రయత్నించాలని హార్దిక్ పాండ్యాను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడటం ముఖ్యమని భారత ఆటగాళ్లను బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఈ రూల్ హార్దిక్ పాండ్యాకు వర్తిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ అతను దేశవాళీ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం బరోడా తరఫున బరిలోకి దిగాల్సి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యాను నేరుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు.