బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో చెలరేగిన హింస తాలుకు ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మారింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్యమిస్తుందని ఐసీసీ ప్రకటించింది. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబర్ లో ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్‌లో టోర్నీని నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే, బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి చాలా జట్లకు అనుమతి లభించనందున మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను వేరే చోటికి మార్చవలసి వచ్చింది అని ICC చీఫ్ జెఫ్ అల్లార్డైస్ అన్నారు. కాగా బంగ్లాదేశ్‌లో ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించ లేకపోవడం సిగ్గు చేటు అని జెఫ్ అన్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో ఐసీసీ టోర్నీలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.
చివరి నిమిషంలో టోర్నీని మరో చోటికి మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం భారత్‌లో టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)ని అనుమతి కోరింది. అయితే, ఈ ఏర్పాటు సాధ్యం కాదని బీసీసీఐ కార్యదర్శి జయ షా కొట్టి పారేశారు. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బదులుగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే క్రికెట్ శ్రీలంక మరియు జింబాబ్వే క్రికెట్ బోర్డు కూడా టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకు వచ్చాయి.
భారత్‌కు తొలి ప్రత్యర్థి న్యూజిలాండ్
అక్టోబర్ 3న ప్రారంభమయ్యే 2024 ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్‌లో ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు అక్టోబర్ 4న ప్రమాదకరమైన న్యూజిలాండ్‌తో పోరాడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది.