టీమిండియా యువ ఆల్‌రౌండర్, 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్ లోను 23 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 42 పరుగులు జట్టు స్కోరు వద్ద సంజూ శాంసన్ (10), అభిషేక్ శర్మ (16), సూర్యకుమార్ యాదవ్ (8) వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ 4వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆరంభంలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టిన నితీష్ రెడ్డి మెల్లగా పరుగుల వేగాన్ని పెంచాడు. ఐపీఎల్‌లో స్పిన్నర్లపై ప్రతాపం చూపి తన బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించిన నితీశ్.. ఢిల్లీలోనూ బంగ్లా స్పిన్నర్లను చెడుగుడు ఆడుకున్నాడు. నితీష్ మెరుపు వేగంతో 74 పరుగులు చేశాడు. అంతే కాకుండా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున 70కి పైగా పరుగులు, 2 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
నితీష్‌కు మంచి సహకారం అందించిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ 29 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగుల చేయండంతో భారత్ భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. స్లాగ్ ఓవర్లలో, హార్దిక్ పాండ్యా కూడా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు, ఫలితంగా భారత్ వారి 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఛేజింగ్ ఎంచుకుని తడబడిన బంగ్లాదేశ్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు ఛేజింగ్ లో వికెట్ కాపాడుకోలేక కష్టాల్లో పడింది. వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా (39 బంతుల్లో 41) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పోరాటం చేయలేదు. ఫలితంగా బలమైన భారత జట్టు బౌలింగ్ కు నిలవలేక బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
టీమిండియా తరఫున ఆల్ రౌండర్ నిరీష్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, గత మ్యాచ్‌లో హీరో వరుణ్ చక్రవర్తి 19 పరుగులకు 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొత్తం 7 మంది బౌలర్లను ఉపయోగించాడు. అందరూ వికెట్లు తీయడం విశేషం. అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు తీసి సంబరాలు చేసుకున్నారు.