ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ‘డికెక్ యూసుఫ్’. తుర్కియేకు చెందిన ఈ షూటర్.. ఒలింపిక్స్ 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో ఇండియాకు చెందిన మను బాకర్ – సరబ్‌జోత్ సింగ్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించగా.. తర్హాన్-డికెక్ జోడి సిల్వర్ మెడల్ గెలిచారు. డికెక్ యూసుఫ్ చాలా క్యాజువల్‌గా ఎలాంటి స్పెషల్ గేర్, గ్లెయర్ గ్లాసులు లేకుండా టీషర్ట్, జీన్స్ మీద వచ్చి షూట్ చేసి గెలిచాడు. సరే.. బాగుంది. ఆ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోతో లక్షల మీమ్స్ తయారు చేశారు.
తుర్కియేకు చెందిన యూసుఫ్ డికెక్.. 1973లో పుట్టాడు. గొక్సన్ అనే గ్రామంలోనే ప్రైమరీ, సెకెండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. 1994లో మిలటరీ స్కూల్‌లో జాయన్ అయ్యి.. 1999లో మాడ్రిడ్‌లో కోప్రో (Corporal) ఉద్యోగం ప్రారంభించాడు. ఒక ఏడాదిలోనే సార్జెంట్‌గా ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఏడాదిలో ఆంకారాలో టర్కిష్ స్పోర్ట్స్ క్లబ్‌లో అపాయింట్ అయ్యాడు. 2001 నుంచి తుర్కియే జాతీయ మిలటరీ జట్టు, జాతీయ జట్టు తరఫున ఆడటం ప్రారంభించాడు. అక్కడ ఆడుతూనే ఘాజీ యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అనేక పతకాలు దేశానికి అందించాడు. ఇంటర్నేషనల్ మిలటరీ స్పోర్ట్స్ కౌన్సిల్ (ఐఎంఎస్‌సీ) నిర్వహించే అంతర్జాతీయ గేమ్స్‌లో తొలి సారి 2006లో గోల్డ్ కొట్టి తన సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత ఏడాది (2007) మన హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ మిలటరీ గేమ్స్‌లో సిల్వర్ సాధించాడు. మిలటరీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అతనికి ఈ పతకం లభించింది.
ఒలింపిక్ కెరీర్..
మిలటరీ గేమ్స్‌లో సత్తా చాటుతుండటంతో యూసుఫ్‌కు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల ఫ్రీ పిస్టల్ విభాగాల్లో తొలిసారి పాల్గొన్నాడు. కానీ నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 27వ స్థానం, 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌లో 21వ స్థానం లభించాయి. ఇక 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2024 ప్యారీస్ ఒలింపిక్స్‌లో కూడా అతనికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగం క్వాలిఫయింగ్ రౌండ్‌లో 13వ స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మాత్రం తర్హాన్‌తో కలిసి సిల్వర్ సాధించాడు.
షూటింగ్‌లో నంబర్ వన్ ర్యాంకర్..
23 ఏళ్ల కెరీర్ కలిగిన యూసుఫ్.. ఇప్పుడు సిల్వర్ గెలిచాడు. కానీ అతని కెరీర్ అంతా ఎత్తుపల్లాలే. కెరీర్ స్టార్ట్ చేసిన వెంటనే పెద్ద ఈవెంట్లు ఏనాడూ గెలిచింది లేదు. కానీ 12 ఏళ్ల తర్వాత యూరోపియన్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటాడు. 2013లో మూడు గోల్డ్స్, 2016లో ఒకటి, 2018లో మరో గోల్డ్ కొట్టి యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 2014లో రెండు బంగారు పతకాలు సాధించాడు. 2013, 2014 సీజన్ యూసుఫ్ కెరీర్‌లో గెల్డెన్ డేస్‌గా భావించవచ్చు. కానీ ఇటీవల యూసుఫ్ సింగిల్‌గా పాల్గొన్న ఈవెంట్లలో పతకాలు సాధించలేకపోతున్నాడు. ఒక విధంగా తన కెరీర్ చివరి దశకు చేరుకోవడంతో సింగిల్స్ మీద దృష్టి పెట్టడం లేదు. షూటింగ్ కెరీర్‌కి వీడ్కోలు పలుకుదామనుకున్న దశలో నిరుడు బాకులో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ సాధించాడు. అంతే కాకుండా గతేడాదే జరిగిన యూరోపియన్ గేమ్స్‌లో సింగిల్‌గా సిల్వర్ సాధించాడు. దీంతో 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత వచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సింగిల్ ఈవెంట్లో ఓడినా.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మాత్రం సిల్వర్ సాధించి.. తన 23 ఏళ్ల కెరీర్‌లో తొలి సారి ఒలింపిక్ మెడల్ సాధించాడు.