భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయిపోతోంది. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఆదివారం అంటే జులై 7 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ ,లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. సిటీలోని ప్రతి గల్లీ నెల రోజులపాటు వేపాకు తోరణాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో మార్మోగనున్నాయి.
ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు తొలిబోనం సమర్పించడంతో..భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 7న ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జులై 21న ఉండగా..22 రంగం కార్యక్రమం ఉంటుంది.
జులై 28 న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల తర్వాత చివరగా… ఆగస్టు 4న మరోసారి గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవారికి చివరి బోనాన్ని సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి దేవాలయంలో బోనాలు ముగిసిన మర్నాడు రంగం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అయినా.. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు తర్వాత జరిగే రంగంలో వినిపించే భవిష్యవాణి గురించి తెలంగాణ వాసులు ఆసక్తిగా గమనిస్తారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయంలో గల అమ్మవార్లు కాకతీయులు, తానీషాల కాలం నుంచి పూజలందుకోవడంతోనే ఇక్కడ తొలి బోనం సమర్పించి, ఉత్సవాలను ఆరంభిస్తారు. జులై 7న లంగర్ హౌజ్ చౌరస్తా నుంచి ముందుగా బోనాల జాతర ఉత్సవం షురూ అవుతుంది.ఈ ఉత్సవంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తొలి బోనం నుంచి చివరి బోనం వరకు నెలపాటు ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ అమ్మవార్లకు 9 రకాల పూజలను నిర్వహిస్తారు.ఇలా ఆగస్టు 4 వరకు సిటీలోని వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగను నిర్వహించి..అమ్మవారికి వీడ్కోలు పలకడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY