
ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో నేతలంతా ప్రచారాలతో దూసుకుపోతున్నారు. తమ పార్టీ పెద్దల కాళ్లో, గడ్డమో పట్టుకుని వారి మద్దతుతో జనాల్లోకి పోతున్నారు. శేరిలింగంపల్లి బీజేపీలో మాత్రం ఈ సీన్ కనిపించడం లేదు. వర్గపోరుతో కలిసిరాని నేతలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు గట్టి పోటీ ఇవ్వలేక వెనుకబడతున్నారన్న టాక్ నడుస్తోంది. దీంతో తమ క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో పోటీ ఇవ్వగలరా అంటూ బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్యనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీజేపీ నుంచి బరిలో దిగిన రవికుమార్ యాదవ్‌కు పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా సపోర్ట్ చేయడం లేదు. అప్పటి వరకూ టికెట్ఆశించి భంగపడిన లీడర్లు, కార్యకర్తలు అభ్యర్థి వెంట ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. దీనికితోడు పార్టీలో ప్రధాన లీడర్ ఒకటి, రెండు రోజుల్లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అవుతున్నారన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన అరెకపూడి గాంధీ హ్యాట్రిక్ టార్గెట్‌తో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అటు బీఆర్ఎస్ మాదాపూర్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ వి.జగదీశ్వర్ గౌడ్ కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకుని మరీ పోటీకి దిగారు. అంతకుముందే జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గంలో కాలనీల అసోసియేషన్లు, సామాజిక వర్గాల లీడర్లు, గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లను కలిసి గ్రౌండ్ వర్క్ చేసుకొని మద్దతు పొంది కాంగ్రెస్‌లో చేరారు.
జగదీశ్వర్ గౌడ్ సొంతూరు నల్లగండ్ల కావడంతో పాటు హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్లకు భార్య భర్తలిద్దరూ కార్పొరేటర్లుగా ఉండడం కూడా కలిసి వచ్చింది. మరోవైపు టికెట్ఆశించి దక్కని లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. దీంతో పాటు పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోతూ బీఆర్ఎస్అభ్యర్థి గాంధీకి గట్టి పోటీ ఇస్తున్నారు.
బీజేపీ నుంచి మారబోయిన రవికుమార్ యాదవ్ పోటీలో ఉండగా.. అసంతృప్త లీడర్లంతా ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. వారిని కలిసి మద్దతు కోరేందుకు ప్రయత్నించినా కూడా అందుబాటులోకి రాకపోవడంతో రవికుమార్ పరిస్థితి గందరగోళంగా తయారయింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసిరాక పోతుండంతో ఇప్పుడు కమలం పార్టీ అభ్యర్థికి ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతోంది.
నామినేషన్‌కు ఒక్క రోజు ముందు టికెట్ దక్కించుకున్న రవికుమార్ యాదవ్ కు..కాషాయ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, కొరదల నరేశ్ వర్గం నుంచే కాక క్యాడర్ నుంచీ కూడా సపోర్ట్ రావడం లేదు. వారిని కలిసి సహకరించమని చెబుదామన్నా కూడా రవికుమార్ యాదవ్‌ను కలవడానికి కూడా ఆ నేతలు ఇష్టపడటం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నువ్వా, నేనా అని దూసుకెళ్తుంటే.. బీజేపీ అభ్యర్థి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారయింది.
నిజానికి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్.. ఒంటెత్తు పోకడల వల్ల కూడా ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ అతడికి అంటిముట్టనట్లు ఉంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో బీజేపీకి పడాల్సిన వివిధ సామాజిక వర్గాల ఓట్లు కూడా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE