కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతుందేమో అన్నట్లు కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా గంటలు రోజులుగానూ, రోజులు నెలలుగానూ మారిపోతున్నాయా అన్నట్లుగా టైమ్ పరిగెడుతోంది. మరి కొద్దిరోజుల్లోనే 2024 కాల గర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ బీఆర్ఎస్‌కు చేదు అనుభవాలే మిగిలాయి.
గతేడాది డిసెంబర్ లో తెలంగాణలో అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి కొత్త సంవత్సరం కూడా కలిసి రాలేదు. తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితం కావడం ఓ ఎత్తయితే..నమ్ముకున్న ఎమ్మెల్యేలు సైతం.. ఒక్కరొక్కరుగా పార్టీలు మారి అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం రెండో షాక్‌గా మిగిలిపోయింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా ఇదే సమయంలో ఎమ్మెల్సీ, కేసీఆర్ గారాల పట్టి కవిత మార్చి 15న జైలు పాలయ్యి..ఏకంగా ఐదు నెలల పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
ఈ ఘటనలన్నీ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను తీవ్ర వేదనకు గురి చేశాయి. ఓ వైపు కాంగ్రెస్ సర్కారు నాటి బీఆర్ ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణల పేరుతో కమిటీలు, కమిషన్లు వేస్తుండడంతో.. వాటికి కౌంటర్ ఇచ్చుకోవడంతోనే గులాబ్ బాస్ ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలలో అలా అయిపోయింది లోక్ సభ ఎన్నికలు అయినా ఊరటనిస్తాయని అనుకుంటే..వేసవిలో వచ్చిన లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీని మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి.
తెలంగాణలో 2024 మే 13న 18 వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగగా.. బీఆర్ఎస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. జూన్ 4న వెలువడ్డ ఫలితాలలో ఒక్క సీటునూ కూడా గెలుచుకోలేక పోయింది. తెలంగాణలో ఖమ్మం,మహబూబాబాద్లో రెండో స్థానాన్ని పొంది..14 సీట్లలో మూడో స్థానంలో నిలవడంతో పాటు.. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకంగా నాలుగో స్థానానికి పరిమితం అయింది. బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం ఆ పార్టీకి పెద్దే షాకే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయిన పరిస్థితి తలెత్తింది..
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేనల్లుడు హరీష్ అన్నీ తామై చూసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే పార్ములా ఈ కారు రేసు కేసులో..కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ త్వరలోనే ఆయన అరెస్టవడం ఖాయమంటూ ..స్వయంగా రెవెన్యూ మంత్రితో పాటు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కామెంట్లు చేసి తెలంగాణ పాలిటిక్స్ లో హీటును పెంచారు.
వీటికి కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు గట్టిగానే కౌంటర్ ఇస్తూ దేనికైనా రెడీ.. జైలుకైనా వెళతామని చెప్పారు. ఎప్పటికప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో అసలు తప్పే జరగనపుడు అరెస్టులు ఏంటని వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించడంలో కీలక పాత్ర పోషించి.. పదేళ్ల పాటు తెలంగాణలో చక్రం తిప్పి.. కేంద్రంలోనూ సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఏడాది చాలా నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు.మరి నూతన సంవత్సరమైనా గులాబీ పార్టీకి కలిసి వస్తోందో లేదో చూడాలి.