కొద్దిరోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా గురించే చర్చ నడుస్తుంది. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ వరకూ వెళతారో చూడాలంటూ టాపిక్ నడుస్తుంది. ఓ వైపు హైడ్రా నోటీసులతో హడలెత్తిస్తుంటే.. మరోవైపు బుల్డోజర్లు ఎక్కడ ఆగుతాయోనని హైదరాబాదీలు టెన్షన్ పడుతున్నారు.
అయితే తాజాగా హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్‌సాగర్ వైపే సాగనున్నాయన్న వార్త చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. అవును..వారంలో జలాశయం దగ్గర నిర్మాణాలను కూల్చివేయడానికి హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్ అంటే పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు.
అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఆ పరిధిలో ఉన్నాయి. వాటి నుంచి పది భారీ నిర్మాణాలను తాజాగా అధికారులు ఎంపిక చేశారు. అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతోపాటు ఇతర నేతల ఫామ్‌హౌస్‌లు కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.
ఇప్పుడు ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ హద్దు లోపల ఎంత వరకు ఉన్నాయి. బఫర్‌జోన్ లోపల, వెలుపల ఎంత వరకూ ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని హైడ్రా కార్యాలయం.. జలమండలి అధికారులను, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో వచ్చే సోమవారానికి ఈ నివేదికను పూర్తి చేస్తామని అధికారులు హైడ్రాకు నివేదించారు.
ఆగస్ట్ 11న గండిపేట జలాశయం పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తల ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను కూడా నేలమట్టం చేశారు. ఆ తర్వాత సిటీలోని తుమ్మిడికుంటలో నిర్మించిన నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. అలాగే ఈర్లకుంట, చింతల్‌చెరువు, తదితర చెరువుల్లోని ఆక్రమణలను కూడా తొలగించారు.
ఇప్పుడు హిమాయత్‌సాగర్ ఆక్రమణలపైన కూడా దృష్టిపెట్టారు. మొదటి దశలో ఎఫ్టీఎల్లోని పెద్ద బంగ్లాలను కూల్చుతామని, ఆ తర్వాత బఫర్‌జోన్‌లోని కట్టడాలను నేలమట్టం చేస్తామని అధికారులు చెబుతున్నారు. జలమండలితో పాటు ఇతర శాఖ అధికారులు క్షేత్రస్థాయి సమాచారంతో పాటు గూగుల్ మ్యాప్‌ల సహాయంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తిస్తుంది.