హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ట్రాఫిక్. ఎన్ని ఫ్లై ఓవర్లు వచ్చినా, ఎన్ని మెట్రోలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ..ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నగరవాసులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి సిటీలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేయడానికి కొన్ని ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించడానికి రెడీ అవుతోంది.
సిటీలో సిగ్నళ్లు లేని జంక్షన్లే లక్ష్యంగా చేసుకుని..జీహెచ్‌ఎంసీ హెచ్-సిటీ ప్రాజెక్టు కింద కొత్తగా పనులకు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అండర్‌పాస్‌లు,ఫ్లైఓవర్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన రూ.7,032 కోట్ల విలువైన 38 పనులకు అనుమతులు కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. 2వేల373 కోట్ల రూపాయలతో వివిధ పనులకు తొలి దశ కింద టెండర్లను పిలవాలని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ 6 కూడళ్ల అభివృద్ధి చేయనుండగా.. దీనికి అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక మిగిలిన ప్రాజెక్టుల కోసం జీహెచ్ఎంసీ నిధులను ఉపయోగించనున్నారు. నిధుల సమస్య లేకపోవడంతో పనులన్నింటినీ 2-3 ఏళ్లలోనే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
మెహిదీపట్నం నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాహనాలు ప్రస్తుతం ఖాజాగూడ చౌరస్తాలో ఆగుతున్నాయి. దీనికి టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాల కోసం కూడలిలో అండర్‌పాస్, నానక్‌రామ్‌గూడ నుంచి టోలిచౌకి వైపు వెళ్లే మార్గంలో ఓ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు 215 అడుగుల వెడల్పుతో ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు చేపట్టనున్నారు. చింతల్‌లోని ఫాక్స్‌సాగర్ వరద నాలాపై 4 లైన్ల స్టీలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు 150 అ. వెడల్పుతో రోడ్డు పనులు చేపట్టనున్నారు.
అలాగే ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి ఓఆర్ఆర్‌కు నేరుగా వెళ్లేలా.. విప్రో చౌరస్తాపై ఐఎస్‌బీ రోడ్డు నుంచి ఓఆర్‌ఆర్ దిశలో 4 లైన్ల ఫ్లైఓవర్, దానికి కొనసాగింపుగా ఐసీఐఐ చౌరస్తాలో నాలుగు లైన్ల అండర్‌పాస్ నిర్మించబోతున్నారు. ట్రిపుల్ ఐటీ కూడలిలో 3 ఫ్లైఓవర్లు, ఓ అండర్‌పాస్ నిర్మించనున్నారు.
కేబీఆర్ పార్కు చుట్టూ..జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు కూడలిలో..కేబీఆర్ పార్కు మెయిన్ గేటు చౌరస్తాలో.. రోడ్డు నెంబర్ 45 కూడలిలో.. ఫిల్మ్‌నగర్ జంక్షన్‌లో, మహారాజ అగ్రసేన్ కూడలిలో, క్యాన్సర్ హాస్పిటల్ కూడలిలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించబోతున్నారు. ఇవి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంతగా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.