గులాబీ బాస్ ఫాంహౌజ్‌కు పిలిపించి మరీ బుజ్జగించినా..తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం ఆగడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కాంగ్రెస్ తమవైపు లాక్కుంటోంది. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యత సన్నిహితుడైన పోచారం శ్రీనివాస రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి.. హస్తం గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో పోచారం తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అలాగే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా తాజాగా బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. జూన్ 23 రాత్రి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ హస్తం గూటికి చేరుకున్నారు. కేసీఆర్ కుమార్తె కవితకు డాక్టర్ సంజయ్ అత్యంత సన్నిహితుడు కావడంతో.. ఆయన కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా ఈ వలసలు కొనసాగుతాయన్న సమాచారంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వరుసగా బీఆర్ఎస్ నేతలతో కలసి మాట్లాడారు. దీంతో గులాబీ బాస్ అందరినీ కూల్ చేశారని..ఇకపై వలసలకు బ్రేక్ పడినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరి షాక్ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య హస్తం గూటికి చేరారు. దీంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగురికి చేరింది.