తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు. వరద ముంపు ప్రాంతాల సందర్శన అనంతరం స్థానిక ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 7,274 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని, పరిస్థితులు కుదుటపడేవరకూ వారికి ఇక్కడే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ప్రతీ కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిందని, ఇంతకుముందు అక్కడ కేవలం 3 వేల క్యూసెక్కులు వరద మాత్రమే వచ్చేదని సీఎం తెలిపారు. కానీ ఈసారి ఈసారి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందని, భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు బతికిందని వెల్లడించారు. అలాగే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని, ముంపు ప్రాంతాల ప్రజలను మరో సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వారి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థతో కలిసి రెండు, మూడు వేల ఇళ్లు కలిగి ఉండే ఒక కొత్త కాలనీ నిర్మించబోతున్నామని, దీనికోసం సుమారు రూ. 1000 కోట్ల నిధులను కేటాయిస్తామని తెలిపారు. గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా మునిగిపోకుండా ఎత్తైన ప్రాంతంలో కాలనీ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ