ఆ త్యాగధనులకు పుష్పాంజలి – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Attends Police Flag Day Parade at The Police Martyrs Memorial

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్‌లోని గోషామహాల్‌లో జరిగిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. “పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా” అని పేర్కొంటూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు.

అమరుల త్యాగం – ప్రభుత్వ అండ:

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది అమరులవ్వగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని సీఎం గుర్తు చేశారు. గ్రేహౌండ్స్ కమాండోలు టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్, అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్‌లాల్, కానిస్టేబుల్ బి.సైదులులతో పాటు మూడు రోజుల క్రితం వీరమరణం పొందిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ సేవలను సీఎం ప్రత్యేకంగా స్మరించుకున్నారు.

అమరుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం:

ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ సంక్షేమ నిధుల నుంచి అదనంగా రూ. 24 లక్షల (రూ. 16 లక్షలు + రూ. 8 లక్షలు) ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒరిస్సా మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ పోలీసులకు దేశంలోనే అగ్రస్థానం!:

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025’ ప్రకారం, తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించిందని తెలిపారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందడం సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని ప్రశంసించారు. తెలంగాణ పోలీస్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here