దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే ముఖ్యంమత్రి అయ్యాను – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 260.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, జిల్లాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు, గత ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆదిలాబాద్‌లోని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి:

సర్పంచ్ ఎన్నికలపై ముఖ్యమంత్రి సందేశం
  • నిర్మాణాత్మక ఎన్నికలు: “నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోండి. అప్పుడు గొడవలు ఉండవు,” అని సీఎం ప్రజలకు సూచించారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు.

  • అడ్డగోలు ఖర్చులొద్దు: ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టవద్దని, ఆ పెట్టుబడులు తిరిగిరావడం కష్టమని అభ్యర్థులకు ఉద్బోధించారు.

  • యువతకు పిలుపు: సర్పంచ్‌, వార్డు మెంబర్ ఎన్నికల కోసం యువకులు ఊర్లో తిరగకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమై ఐఏఎస్‌, ఐపీఎ్‌సలుగా ఎదగాలని హితబోధ చేశారు.

ఆదిలాబాద్ జిల్లాకు హామీలు
  • జిల్లా దత్తత: ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని, నూటికి నూరు శాతం అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

  • ఎయిర్‌పోర్ట్: రక్షణ, విమానయాన శాఖల సహకారంతో ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఏడాదిలోపే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి, పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌తో పరిశ్రమలు, పర్యాటకం (టైగర్ రిజర్వ్ ఫారెస్ట్) పెరుగుతాయన్నారు.

  • విశ్వవిద్యాలయం: ఇంద్రవెల్లిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వంపై విమర్శలు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫైర్: “ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్దాయన దెయ్యమై పట్టారు,” అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

  • లక్ష కోట్ల నష్టం: లక్షన్నర కోట్లతో కాళేశ్వరం కడితే, మూడేళ్లలోనే అది కూలేశ్వరమై కూలిపోయిందని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును తరలించడం వల్ల రూ. లక్ష కోట్ల నిధులు గోదావరిపాలయ్యాయని ఆరోపించారు.

  • అక్రమ సంపాదన: “ప్రజల సొమ్ము తిన్నవారెవరూ బాగుపడరు. అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబాలు ప్రశాంతంగా ఉండవు,” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  • కొత్త ప్రాజెక్టు: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వ పాలన, సంక్షేమం
  • తన పాలన: దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎంగా విజయవంతంగా పని చేస్తున్నానని, గత రెండేళ్లలో తాను ఒక్క సెలవు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు.

  • ఉద్యోగాలు: గత రెండేళ్లలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.

  • మహిళా సంక్షేమం: మహిళలు ఉచిత బస్సు సౌకర్యంతో సంతోషంగా ఉన్నారని, అందుకే ఈ ఏడాది రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు.

  • సచివాలయం పర్యవేక్షణ: గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సచివాలయానికి వెళ్తే తమను నిర్బంధించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి తప్పిదాలు జరుగకుండా తాము జాగ్రత్త పడుతున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here