మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy’s Message To Grama Sabhas, We Are Servants, Not Rulers

తాము పాలకులం అనే అహంకారంతో కాకుండా, ప్రజల సేవకులం అనే భావనతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ అనే పేరుతో నిర్వహించనున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గురువారం జరిగిన గ్రామ సభలనుద్దేశించి సందేశం అందించారు. ప్రజల జీవితాల్లో మార్పుకోసమే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన సంక్షేమం మరియు అభివృద్ధి విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, ప్రజల ఆకాంక్షలు మరియు అవసరాలే కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వం నిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి రెండేళ్ల మూడు నెలలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక ఆర్థిక సవాళ్లను ధీటుగా అధిగమించామని సీఎం తెలిపారు.

సామాజిక బాధ్యత మరియు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు లభించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవలి ఉప ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాలు తమపై బాధ్యతను మరింత పెంచాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి సామాన్యుడి జీవితంలో స్పష్టమైన మార్పు తేవాలన్నదే తమ సంకల్పమని, అందుకే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు సాగే ఈ ప్రత్యేక కార్యాచరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఒక ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, అభివృద్ధి కోసం పూనుకున్న ఒక పవిత్రమైన దీక్ష అని ఆయన అభివర్ణించారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై, మన రాష్ట్రాన్ని దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా నిలబెట్టాలన్నది తన కల అని ముఖ్యమంత్రి ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ఈ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని, ప్రజలందరి సంపూర్ణ సహకారం తమ ప్రభుత్వానికి ఉండాలని కోరారు. ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లె మరియు పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here