మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో 55 కిమీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. మలక్‌పేట్ పరిధిలోని శంకర్‌నగర్ మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్లను సైతం అధికారులు దగ్గరుండి కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేయిస్తున్నారు. నిర్వాసితులను ఇప్పటికే చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమాదాయానికి తరలించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి.
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో గల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. మూసీ సుందరీకరణ, ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్‌తో ముందుకు దూసుకుపోతోంది. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది.
అయితే డబుల్ బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X అని రాశారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తారంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలను అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా మార్క్ సర్వే ను అధికారులు కొనసాగిస్తున్నారు. పోలీసు భద్రత మధ్యే ఈ సర్వే సాగుతోంది.