తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ టూర్ తర్వాత కూడా బిజీబిజీగానే గడుపుతున్నారు. వచ్చిన రోజే కాగ్నిజెంట్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తర్వాత రోజు వైరా సభలో మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు.తర్వాత ఢిల్లీలోనూ బిజీగానే గడిపారు. దీనికితోడు విదేశాలలో ఉండగా తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలపైన కూడా నేతలతో చర్చలు జరిపారు.
తాజాగా ఆగస్ట్ 18న ఆదివారం రోజు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడానికి తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు, కేకే స్థానంలో జరగబోయే ఉపఎన్నికపై మెయిన్ ఫోకస్ పెట్టి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశవరావు రాజీనామా చేయడంతో సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఈమధ్య కాంగ్రెస్ అధిష్టానం ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్‌ను గెలిపించడమే ప్రధాన ఎజెండాగా.. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్ఎఫ్ సమావేశంలో చర్చించనున్నారు.
దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకూ సంక్షేమ పథకాల అమలు తీరును కూడా ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు.
ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మను సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.