ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవితఖైదు శిక్షకు గురైన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో దోషిగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆ నిందితుడు, కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు.
ఈ ఘటనతో కోర్టు ఆవరణలో ఒకసారిగా గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన న్యాయవాదులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. దీనివల్ల కొంతకాలం ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక మరో ఘటనలో, అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెవెన్యూ అధికారి (RI) లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన కుంభం రాజిరెడ్డి జనవరిలో మరణించగా, ఆయనకు చెందిన 3.25 ఎకరాల భూమిని భార్య సుజాత పేరిట మార్చుకునేందుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేశారు.
అయితే, ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మన్యం నర్సింహారెడ్డి రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో, వారు సిద్దిపేట బీజేఆర్ చౌరస్తా సమీపంలోని టీ పాయింట్ వద్ద జాగ్రత్తగా గమనించి, డబ్బులు తీసుకుంటూ నర్సింహారెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సిద్దిపేటలోని అతని నివాసం, దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.