తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుఫాన్‌

Cyclone Montha Batters Telangana, Triggers Widespread Flooding

ఆంధ్రప్రదేశ్‌ను రెండు రోజుల పాటు అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్‌ ఇప్పుడు తెలంగాణలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తీరాన్ని దాటి వాయువ్య దిశగా ఒడిశా వైపుకెళ్తుందని భావించిన ఈ తుఫాన్‌ బుధవారం ఉదయం అంచనాలకు విరుద్ధంగా దిశ మార్చుకుంది. ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురిసాయి.

భారీ వర్షాలతో జనజీవనం స్తంభించి, రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మొంథా ప్రభావం మంగళవారం రాత్రి నుంచే కనిపించింది. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షాలు ఎడతెరిపిలేకుండా కురిశాయి.

హనుమకొండ, వరంగల్‌, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో విపత్తు పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రానికి తుఫాన్‌ వాయుగుండంగా బలహీనపడినప్పటికీ దాని తీవ్రత మాత్రం తగ్గలేదు. ఈ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసి అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్లు, వరంగల్‌ జిల్లాలోని కల్లెడలో 34.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట నగరాల్లో దాదాపు 30కుపైగా కాలనీలు నీటమునిగాయి. ఎంజీఎం ఆసుపత్రి, బస్టాండ్‌, ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది.

నల్గొండ, సూర్యపేట, దేవరకొండ ప్రాంతాల్లోనూ వాగులు పొంగి పాఠశాలలు, గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాగర్‌కర్నూల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దిండి, మున్నేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దాని ప్రభావంతో లత్తీపూర్ వద్ద శ్రీశైలం–హైదరాబాద్‌ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయం ఏర్పడగా, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తుఫాన్‌ ప్రభావం రైల్వే, ఆర్టీసీ సేవలపై కూడా తీవ్రంగా పడింది. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేయగా, ఖమ్మం, డోర్నకల్‌ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీరు చేరింది. వందేభారత్‌ రైలు గుంటూరు మార్గంగా మళ్లించబడింది.

తెలంగాణ ఆర్టీసీ మొత్తం 135 బస్‌ సర్వీసులను రద్దు చేసింది, అందులో 72 అంతర్రాష్ట్ర సేవలు ఉన్నాయి. తుఫాన్‌ బలహీనపడినా రాష్ట్రంలోని వరంగల్‌, మహబూబాబాద్‌, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్‌ అవకాశం ఉండటంతో అక్కడ రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here