
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న డి.ఎస్.. హైదరాబాద్ లోని తన నివాసంలో నేడు తుది శ్వాస విడిచారు.ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. డి.ఎస్ ఇద్దరు కుమారులలో..పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు. ఇటు రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ ఇప్పుడు బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
1948 సెప్టెంబర్ 27న జన్మించిన డి.శ్రీనివాస్.. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికలలోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు.
అలాగే 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డి.ఎస్ కీలక భూమిక పోషించారు. 2004లో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్రను పోషించారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2015లో డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన డి.శ్రీనివాస్.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని వదిలి తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు.
ధర్మపురి శ్రీనివాస్ రెండు సార్లు మంత్రిగా కొనసాగారు. 1989- 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా కొనసాగిన ధర్మపురి శ్రీనివాస్..2004 – 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. అంతేకాదు సోనియా గాంధీకి విధేయునిగా డి.ఎస్‌కు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల తరువాత అనారోగ్య కారణాలు వేధించడంతో.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. డి. శ్రీనివాస్ మృతిపై అన్ని పార్టీల నాయకులు, సెలబ్రెటీలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE