ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే మోతలు మోగడం కామన్ అయిపోయింది. అసలు డీజే లేనిదే దావత్‌కు అర్థమేలేదన్నట్లు మనుషుల మైండ్ సెట్స్ తయారయ్యాయి. మజా కోసం మొదలైన ఈ డీజే కల్చర్ వల్ల.. మరణాలు సంభవిస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు.
డీజే మితిమీరిన శబ్దాలతో పసిపిల్లలతో పాటు యువకులకు కూడా గుండెపోట్లు వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. చాలామంది కర్ణభేరులు దెబ్బతింటుండటంతో పోలీసులు దీనికి చెక్ పెట్టే చర్యలకు ఉపక్రమించారు. ఇక నుంచి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాలు ఏమైనా సరే ఎక్కడైనా సరే.. డీజేల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం తెలిపారు.
డీజే సౌండ్లు, ఫైర్‌క్రాకర్స్ వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో.. వాటి నిషేధంపై కీలక నిర్ణయిం తీసుకున్నట్లు సీపీ ఓ ప్రకటనలో తెలిపారు.తాజాగా జరిగిన గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపుల్లో డీజే ఫుల్ సౌండ్స్ పెట్టి పోటాపోటీగా ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించారు.
నిబంధనలున్నా కూడా వీటిని తుంగలో తొక్కి నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని సీపీ తెలిపారు. ఉత్సవాల్లో నిర్వాహకులు, యువత అడుగడుగునా పోలీసులకు అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. విపరీతమైన డీజే సౌండ్ల వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు చాలా ఇబ్బందులకు గురయ్యారని సీపీ వివరించారు. దీంతోనే హైదరాబాదీల నుంచి డయల్ 100కు వందలాది ఫిర్యాదులు వచ్చాయని సీపీ తెలిపారు.
తాజాగా ఇదే అంశంపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర పోలీస్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు.. పలు శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, వివిధ సంస్థల ప్రతినిధులతో కలిసి సీపీ సీవీ ఆనంద్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. డీజే సౌండ్స్ వల్ల హైదరాబాద్ లో జరిగిన అనర్థాలు, అనారోగ్య సమస్యలు, ధ్వనికాలుష్యం, వృద్ధులు, చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వంటి కొన్ని అంశాలపై సీపీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించాకే..ఇప్పుడు డీజేలపై నిషేదం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని సీపీ వివరించారు.