అల్లు అర్జున్ మీద బనాయించిన కేసులో బన్నీకి ఇప్పటికే ఊరట దక్కింది. తెలంగాణా హైకోర్టు మంజూరు చేసిన కండిషన్ బెయిల్‌తో ఆయన బయట ఉన్నారు. అదే సమయంలో తనకు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై ఇప్పటికే నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణా పోలీసుల తరుపున వాదనలు కూడా కోర్టు ముందు వినిపించారు. కేసులో జనవరి 3న తీర్పు వెలువరిస్తామని ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఈరోజు అల్లు అర్జున్ కేసులో కీలక తీర్పు వెలువడబోతోంది. ఆయనకు పూర్తిస్థాయి బెయిల్ మంజూరుకావడానికి అన్ని రకాలుగా ఆస్కారముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ ఇప్పటికే పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. కేసు విచారణ నిమిత్తం ఆయన చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యారు. నోటీసులకు అనుగుణంగా వ్యవహరించారు. పోలీసుల ప్రశ్నలన్నింటికీ తన దగ్గర ఉన్న సమాచారం అందించారు. పూర్తి నిబద్ధతతో వాస్తవాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తాను మీడియా ముందు చెప్పిన అంశాలకు కట్టుబడి వ్యవహరించారు. దాంతో బన్నీని సుమారు 3గంటల పాటు విచారించిన పోలీసులు, అవసరమైతే మళ్లీ పిలుస్తామని తెలిపారు. దానికి కూడా అల్లు అర్జున్ కూడా అంగీకరించారు.
పోలీసుల విచారణకు సహకరిస్తూ, పోలీసుల ఆదేశాలను పాటించడానికి ఎటువంటి తాత్సార్యం చేయకుండా సాగుతున్న అల్లు అర్జున్ కి పూర్తిస్థాయి బెయిల్ దక్కడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు ముందు అల్లు అర్జున్ తరుపున సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా పలు అంశాలు తీసుకొచ్చారు. అల్లు అర్జున్ నేరం లేకపోయినా కేసులో బన్నీ పేరు తీసుకురావడంపై నిరంజన్ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోబోతున్న కోర్టు నుంచి బన్నీకి ఊరట లభించడం ఖాయంగా భావిస్తున్నారు.