తెలంగాణ లోక్ స‌భ : ఎవ‌రి అంచ‌నాలు వారివే

Telangana Lok Sabha Whose Expectations Are Theirs, Telangana Lok Sabha Expectations, Lok Sabha Expectations, Expectations Telangana Lok Sabha, Lokh Sabha Elections, BRS, Congress, BJP, Latest Telangana Lok Sabha News, Telangana Lok Sabha News Update, Telangana, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Lokh sabha Elections, BRS, Congress, BJP

తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌ళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాక‌ముందే.. ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాట‌ల తూటాల‌ను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన బీఆర్ ఎస్‌.. లోక్ స‌భ‌లో అయినా స‌త్తా చాటాల‌ని ముంద‌స్తుగా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నేటి నుంచి సన్నాహాక సమావేశాలు ప్రారంభించింది. ఈనెల 21 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, పార్టీ నేతలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు నేటి నుంచి 12 వరకు జరుగుతాయి.

మ‌రోవైపు కాంగ్రెస్ కూడా ఈరోజు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జ‌రిగింది. నూతనంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్లు అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం ఇది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్‌గా ఈ సమావేశం జ‌రిగింది. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై కూడా సమావేశంలో చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. సంక్రాంతి పండుగ అనంత‌రం బీఆర్ ఎస్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా లోక్ స‌భ స్థానాల‌పై ఫోక‌స్ పెట్టింది.

బీజేపీ నుంచి అమిత్‌షా సైతం లోక్‌సభపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన ఆయ‌న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై రాష్ట్ర నాయకులకు ఒక రకంగా క్లాస్‌ పీకారు. ఆధిపత్యం, వర్గపోరు తదితర అంశాలతో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సినన్ని సీట్లు గెలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన ఒక్క సీటు నుంచి ఈసారి ఎనిమిది సీట్లు గెలవడం విజయమే అయినప్పటికీ, తాము ఈసారి 30 సీట్లు గెలవగలమని భావించినట్లు చెప్పారు. అయిందేదో అయింది. ఇకనైనా సమన్వయంతో పనిచేయండి. కష్టపడి పనిచేసి 10 లోక్‌సభ సీట్లు, 35 శాతం ఓట్లతో గెలిచి మోదీకి బహుమతిగా ఇవ్వాలని ఉద్భోదించారు. సిట్టింగ్‌ ఎంపీలకు మళ్లీటిక్కెట్లిస్తామని భరోసాఇచ్చారు.

అసెంబ్లీ లో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్ స‌భ  స్థానాల్లో కూడా విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసేందుకు సిద్ధం అవుతోంది. 12 స్థానాల్లో క‌చ్చితంగా గెలుస్తామ‌ని భావిస్తోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన సభలో రాహుల్‌ గాంధీ తాము గెలిస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఇది క‌లిసి వ‌స్తుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తాను అధికారంలోకి వచ్చాక జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెల‌వాల‌నే ల‌క్ష్యంలో ఉన్నారు. మోదీ కాలం చెల్లిన ఔషధమని, ఆయన మాటలు ప్రజలిక నమ్మబోరని, ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ఇప్ప‌టికే ఎన్నిక‌ల శంఖారావం పూరించారు. మొత్తం 17 లోక్ స‌భ స్థానాలు ఉన్న తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ ఎస్ కూడా మెజార్టీ స్థానాలు త‌మ‌వే అని పేర్కొంటూ.. సాధించే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =