తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరిపారు. కొత్తగా మంత్రి వర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై చర్చించారు. ఈ మేరకు నలుగురు పేర్లతో జాబితాను రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు అందించారు.
అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంటక్ రెడ్డిలు కూడా ఇద్దరి పేర్లను హైకమాండ్‌కు సూచించారు. అయితే ప్రస్తుతం అరు ఖాళీలు ఉన్నప్పటికీ.. నాలుగు స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ అనుకుంటోందట. కొంత సమయం తర్వాత మిగిలిన రెండు స్థానాలను భర్తీ చేయాలని భావిస్తోందట. ఈ మేరకు వారికి సూచించిన ఆరుగురు పేర్లలో నలుగురిని ఫైనల్ చేయాలని హైకమాండ్.. రాష్ట్ర నేతలను ఆదేశించిందట. ప్రస్తుతం ఆరుగురిలో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారట.
అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజు నుంచి వాకిటి శ్రీహరి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మైనార్టీ కోటాలో కాంగ్రెస్ షబ్బీర్ అలీని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారట. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని మొన్నటి వరకు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే పోచారం మంత్రి పదవి తనకు వద్దని చెప్పడంతో.. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మరో నేతకు అవకాశం కల్పించారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సదర్శన్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారట. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నారట. దాదాపు ఈ నలుగురి పేర్లు ఫైనల్ అయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE