మెట్రో ట్రైన్ రెండో దశ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కి.మీటర్లలో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. 32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో ట్రైన్ రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయబోతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకూ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.
ఇటీవలే మెట్రో ట్రైన్ రెండో దశ డీపీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మార్పులు చేశారు. ఆరాంఘర్ – బెంగళూరు నేషన్ హైవే కొత్త హైకోర్టు మీదుగా.. విమానాశ్రయానికి మెట్రో ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎయిర్‌పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల వరకూ.. భూగర్భంలో మెట్రో వెళ్లనుంది.
8 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలో మీటర్ల మేర మెట్రో ప్రయాణించబోతోంది. రెండో దశ కనుక పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల వరకూ మెట్రో పరుగులు తీయనుంది.