తెలంగాణలో నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. మూడు వారాల పాటు సర్వే జరగనుంది. ఈ సర్వేలో భాగంగా.. ప్రతి ఇంటి నుంచి సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కుల గణన కోసం ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా అధికారులు, సిబ్బంది డేటా సేకరించనున్నారు. ఇందు కోసం సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది.
ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదని… సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ సర్వేకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణ పైన నిర్ణయం ఉంటుందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో సమగ్ర రాష్ట్రంలో కులగణన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్బంగా తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం నమోదు చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో కుల గణన అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఈ ప్రక్రియ కోసం టీచర్ల సేవలను వినియోగించుకోనుంది. దీంతో నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.కులగణన కార్యక్రమం కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లను నియమించింది ప్రభుత్వం. 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, 2 వేల మినిస్టీరియల్ సిబ్బంది.. మొత్తం 48,229 మంది ఈ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే మూడు వారాల పాటు కొనసాగనుంది.సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాలలు పనిచేస్తాయి. తర్వాత ఉపాధ్యాయులు సర్వే ప్రక్రియ మొదలు పెడతారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్స్ సర్వే నుంచి మినహాయించారు.