తెలంగాణలో రైతు రుణమాఫీ పై బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తునే ఉంది. ఆగస్టు 15 న 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నామని..ఇక హరీష్ రావు సవాల్ చేసినట్లు రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బిఆర్ఎస్ మాత్రం పూర్తిస్థాయి లో రుణమాఫీ చేయకుండా కేవలం 25 % మందికి మాత్రమే రుణమాఫీ చేసి..అందరికి చేశామని ప్రకటనలు చేస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంటో ఈ వార్ మరింత హీటెక్కింది. ఈ క్రమంలో హరీష్ రావు సైతం సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేలల్లో రుణగ్రహీతలు ఉంటే వందల మందికే రుణమాఫీ అయిందని చూపించారు. తన నియోజకవర్గంలోనే చాలా పల్లెలు ఇలాంటివి ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్‌లో కాల్ సెంటర్ పెడితే తమకు లక్షమందికిపైగా తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్లు చేసి చెప్పారన్నారు.
ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం 14 వేల కోట్లు కోత పెట్టిందని ఆరోపించారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. తాము 17వేల కోట్లతో లక్ష రుణమాఫీ చేస్తే 36లక్షల మంది రైతులకు రుణ మాఫీ జరిగిందన్నారు. కాంగ్రెస్ 17వేల కోట్లతో రుణ మాఫీ పూర్తిగా ఎలా అవుతుందని మాజీమంత్రి ప్రశ్నించారు. రేవంత్ పరిపాలనలో ఫ్లాప్ రేవంత్ తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాప్ అని హరీష్ వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు రేవంత్ రెడ్డి భేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీలో కోత.. మాటలేమో రోత అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. బూతులు తిడితే రైతు రుణమాఫీ పూర్తవుతుందా? అని ప్రశ్నించారు. రంకెలు వేస్తే అంకెలు మారిపోవని, అబద్ధాలు నిజమైపోవని తెలిపారు. నీ తిట్లతో రైతుల ఖాతాలో కోట్ల రూపాయలు పడవని స్పష్టం చేశారు.
25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని వివరించారు. రేవంత్ ఎక్కడకు చెబితే అక్కడకు వస్తానని హరీష్ సవాల్ చేసారు. ప్లేస్ నువ్వే డిసైడ్ చెయ్.. సంపూర్ణ రుణమాఫీ అయిందో.. లేదో.. రైతులనే అడుగుదాం అంటూ ఛాలెంజ్ విసిరారు. కొడంగల్‌లో ఓడితే రాజీనామా చేస్తా అని చెప్పి మాట తప్పారని రేవంత్ పై మండిపడ్డారు. తెలంగాణ కోసం మాట మీద నిలబడి రాజీనామా చేసిన చరిత్ర తనదని గుర్తు చేసారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని తాను చెప్పానని.. కానీ రుణమాఫీ కూడా సంపూర్ణంగా కాలేదన్నారు. రుణమాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. రుణాలు తీసుకున్న మొత్తం రైతుల సంఖ్య ఎంత, రుణమాఫీ అయిన రైతుల సంఖ్య ఎంతనో పూర్తి వివరాలు బయట పెట్టాలన్నారు. రేవంత్ పరిపాలనలో ఫ్లాప్ తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్ అని విమర్శించారు. త్వరలోనే రైతుల పక్షాన బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుందని వెల్లడించారు.