అమెరికాలో సత్తా చాటిన హైదరాబాద్ యువకుడు.. ఎన్విడియాలో 3 కోట్ల వేతనంతో ఉద్యోగం

హైదరాబాద్‌కు చెందిన యువకుడు జి సాయి దివేశ్‌ చౌదరి తన ప్రతిభతో అమెరికాలో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించి, కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు. ఎల్‌బీనగర్‌లోని చిత్రా లేఅవుట్‌కు చెందిన దివేశ్‌ తాజాగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని పొందాడు. దివేశ్‌ విద్యా ప్రస్థానం చూస్తే, ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు. అనంతరం ఎన్‌ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్‌ సైన్స్‌లో బిటెక్‌ పూర్తి చేశాడు. అతని ప్రతిభను గుర్తించిన న్యూటానిక్స్‌ కంపెనీ, రూ.40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం అందించింది. కానీ దివేశ్‌ అక్కడే ఆగకుండా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు.

లాస్‌ఏంజెలెస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసిన దివేశ్, అక్కడే పరిశోధనలలో ముందంజ వేసాడు. తాజాగా, ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియాలో డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగం పొందాడు. కంపెనీ నుంచి భారీ సైన్‌ ఆన్‌ బోనస్, స్టాక్‌ యూనిట్లతో కలిపి దివేశ్‌ వార్షిక వేతనం రూ.3 కోట్ల వరకు ఉంటుంది.

దివేశ్‌ తండ్రి కృష్ణమోహన్‌ స్థిరాస్తి వ్యాపారి కాగా, తల్లి శైలజ గతంలో రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. తన కుమారుడు ఇంతటి ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందని కృష్ణమోహన్‌ తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపిన దివేశ్, క్రీడలు, ఇతర పోటీల్లోనూ తన మేటి ప్రతిభను ప్రదర్శించేవాడని ఆయన అన్నారు.

ప్రస్తుతం దివేశ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కొత్త యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అతని విజయగాథ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు.