నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతపై స్పందించిన హైడ్రా..!

Hydra Officials Who Overthrew The N Convention | Mango News Telugu

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల వార్త హైదరాబాద్ లో చర్చనీయాంశం అయింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగస్ట్ 21 తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో ఫిర్యాదు చేశారు. కోమటి రెడ్డి లేఖపైన వెంటనే విచారణ జరిపిన హైడ్రా కమిషనర్.. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు గుర్తించింది. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి అందించడంతో…. మంత్రి లేఖపై విచారణ జరిపి రంగంలోకి దిగిన హైడ్రా.. ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. ముందుగా కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లను పూర్తిగా పడగొట్టేసింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కన్వెన్షన్ సెంటర్లోని హాళ్లను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. కన్వెన్షన్ సెంటర్ ఆఫీసు గోడకు మాత్రమే నోటీసులను అంటించి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

కూల్చివేతలపై ముందుగా నోటీసులు ఇస్తే నాగార్జున కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని హైడ్రా టీం భావించినట్లు తెలుస్తోంది. అందుకే కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి ముందస్తు నోటీసులను కూడా అధికారులు జారీ చేయలేదు. తుమ్మిడి కుంట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమిని నాగార్జున ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్స్ ను మొత్తంగా హైడ్రా నేలమట్టం చేసేసింది.

కాగా అది పట్టా భూమి అని, అందుకే నిర్మాణం చేపట్టినట్లు నాగార్జున చెబుతున్నారు. కోర్టులో స్టే ఉన్నా, హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారని ఆయన ఆరోపించారు. అయితే అక్కడ భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. FTL పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటల భూమిని ఎన్ కన్వెన్షన్ ఓనర్ ఆక్రమించినట్లు హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.