తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. అయితే, తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశాను. ప్రజాప్రతినిధిగా.. నేను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వ్యాఖ్యలుచేసే వారికి ఇది గుణపాఠం కావాలి. కోర్టులో నిజం గెలుస్తుందని నాకు నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
అటు ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ పై కూడా కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ల ఫలితాలు ప్రస్తుతం విడుదలవుతున్నాయనీ, కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 1,60,083 ఉద్యోగాలు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారనే విషయంపై వారు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అశోక్ నగర్‌కు వచ్చి ఈ అంశంపై చర్చించండి అని కేటీఆర్..సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు.
ఇక కేసీఆర్ నాయకత్వంలో జీవో 55 తీసుకొచ్చామని , ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు న్యాయం జరగాలని, ఓపెన్ కోటాలో కూడా రిజర్వ్‌డ్ వారికి అవకాశం కల్పించే విధంగా జీవో ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. జీవో 29పై తాము జూన్, జులై నుంచి మొత్తుకుంటున్నాం. శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రెస్‌మీట్ పెట్టి ఆర్ఎస్పీ, దాసోజు శ్రవణ్ పలుమార్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు వైఖరి వల్ల గందరగోళాల మధ్య పరీక్ష నిర్వహించారని కేటీఆర్ ధ్వజమెత్తారు.