వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ..తెలంగాణ చలితో గజ గజ వణుకుతోంది. చలి తీవ్రత పెరుగుతుండగా..జనం ఇబ్బంది పడుతున్నారు. ఏటా డిసెంబర్‌లో చలి పెరగడం సాధారణమే. కానీ, ఈసారి మరింత పెరగడంతో.. వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చలి తీవ్రతకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనాల వల్ల కూడా తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు.. పొగమంచు ఎక్కువగా కురుస్తోంది. దీంతో ఐఎండీ అధికారులు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోండగా..మరి కొన్ని జిల్లాలో ఏకంగా 10 డిగ్రీలకు దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలకు దిగువనే నమోదువుతన్నాయి.
చలి తీవ్రత పెరుగుతుండటంతో డిసెంబర్ 18, 19 తేదీల్లో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. దీనిపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రవంగల్ జిల్లాలలో ప్రజలంతా డిసెంబర్ 18న అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు చలి తీవ్రత వల్ల ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారతో పాటు ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వ్యవసాయ పనులు, ఇతర పనులకు వెళ్లే కూలీలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చలి నుంచి రక్షించుకోవడానికి ఉన్ని వస్త్రాలు, ముదురు రంగు వస్త్రాలు ధరించాలని సూచించారు. ఆస్తమా రోగులు, శ్వాసకోస సంబంధిత రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.