ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కోసం ఎదురు చూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తీపి కబురు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీపావళి పర్వదినం రోజున ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి అతి పేదవారికి ఈ ఇండ్లు కేటాయిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. దీపావళి తరువాత ఓ మంచిరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి శ్రీకారం చుడతామని పొంగులేటి తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు ఏర్పాటు చేసే ఇందిరమ్మ కమిటీలు అర్హులైన లబ్దిదారుల జాబితా రూపొందించి, ప్రత్యేక యాప్ లో వివరాలు నమోదు చేస్తారని వెల్లడించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ పథకం కేవలం బీపీఎల్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తారు. ఇల్లు సొంతంగా ఉండి, కిరాయి ఇంట్లో లేదా కచ్చా ఇండ్లలో నివసించే వారే అర్హులు. గడచిన కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాదిరిగా కాకుండా, లబ్ధిదారుల సొంత స్థలంలో నాలుగు దశల్లో ఈ ఇండ్ల నిర్మాణం చేపడతారు.
ఇంటి నిర్మాణానికి మొత్తం రూ. 5 లక్షలు మంజూరు చేస్తారు. పునాదులు పూర్తి అయిన తర్వాత ఒక లక్ష, రూఫ్ లెవల్‌కు చేరుకున్న తర్వాత మరో లక్ష, స్లాబ్ వేయించిన తర్వాత రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ఇక స్థానికత విషయంలో 317 జీవో, కొత్త ఉద్యోగాల భర్తీపై 46 జీవోపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించిన తరువాత తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని మంత్రి పొంగులేటి చెప్పారు. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది కనుక న్యాయసలహా ముందుగా న్యాయసలహా తీసుకుంటాం. తరువాత అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి ప్రతిపాదన చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కులగణన కు సంబంధించి అడగడానికి రూపొందించిన ప్రశ్నలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 4, లేక 5న ప్రారంభించి నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు, కొత్త రోడ్ల నిర్మాణానికి, రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.