పుష్ప ద రూల్ విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చిన సమయంలో జరిగిన ఘటనలపై తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అడ్వకేట్ ఇమ్మినేని రామారావు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణకు శ్రీకారం చుట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. తెలంగాణా డీజీపీ జితేందర్ తో పాటుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
సినిమా ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ వచ్చిన సమయంలో పోలీసుల లాఠీఛార్జ్ మూలంగానే తొక్కిసలాట జరిగిందని పిటీషనర్ పేర్కొనగా.. ఈ అంశంపై ఎన్ హెచ్ ఆర్ సీ ఘాటుగా స్పందించింది. పోలీసుల తీరు మీద పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రేవతి మృతి, శ్రీ తేజ్ ఆస్పత్రి పాలయిన ఘటనలో ఇప్పటికే పోలీసుల పాత్ర మీద పలు సందేహాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినా గానీ పోలీసుల వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ ను నిందించే ప్రయత్నం చేసినట్టు అభిప్రాయాలున్నాయి. చివరకు ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ మీద చేసిన వ్యాఖ్యల వెనుక హోం శాఖ తన పర్యవేక్షణలో ఉండగా, అక్కడ జరిగిన లోపాన్ని కప్పిపుచ్చేయత్నమేననే విమర్శలు విపక్షం నుంచి వచ్చాయి.
తాజాగా నేరుగా ఎన్ హెచ్ ఆర్ సీ కూడా అలాంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని నోటీసులు జారీ చేయడంతో పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఎన్‌హెచ్‌ఆర్‌సీకి డీజీపీ, సీపీ పంపించే నివేదికలో ఏముంటుంది, దాని మీద తదుపరి విచారణలో ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.